Vinayaka Chavithi : గణేశ్ పండగంటే... హైదరాబాద్ లోనే.. చూసి తీరాల్సిందే మరి
వినాయక చవితి పండగను దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటారు. హిందువులకు అతి ముఖ్యమైన పండగ;
వినాయక చవితి పండగను దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటారు. హిందువులకు అతి ముఖ్యమైన పండగ. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఏటా భాద్రపద మాసం శుక్ల చతుర్ధి నాడు వినాయక చవితి పండగ వస్తుంది. గణేశ్ చతుర్ధికి పిల్లా పాపలతో కలసి కుటుంబమంతా కూర్చుని ప్రార్థిస్తారు. తమ ఇంట్లోనే మట్టి గణపతిని తెచ్చుకుని పూజిస్తారు. అన్ని రకాల పత్రులతో గణేశుని పూజిస్తే శుభప్రదమని నమ్ముతారు. గణేశ్ చతుర్ధి పండగ ఒక రోజైనా కొందరు తొమ్మిది రోజులు, మరికొందరు పదకొండు రోజులు, ఇంకొందరు మూడు రోజులు.. చాలా మంది ఒకరోజు పూజలు నిర్వహించి తర్వాత గశేశ్ ప్రతిమను నిమజ్జనం చేస్తారు. హైదరాబాద్ లో ప్రతి వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.
హైదరాబాద్ కు విశిష్టత...
వినాయక చవితిని గణేశ్ చతుర్ధి అని కూడా పిలుస్తారు. హైదరాబాద్ నగరంలో గణేశ్ పండగకు విశిష్టత ఉంది. హైదరాబాద్, ముంబయి, పూనే నగరాల్లో ఈ పండగను అట్టహాసంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం కొన్ని దశాబ్దాల నుంచి ప్రతిష్టిస్తూ వస్తున్నారు. ఇక్కడ పూజలు అందుకున్న గణపయ్య పదకొండో రోజున నిమజ్జనానికి బయలుదేరుతాడు. హైదరాబాద్ లో కొన్ని వేల విగ్రహాలు ఆ రోజు నిమజ్జనానికి బయలుదేరడంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా యువతతో పాటు వృద్ధులు, పిల్లలు కూడా పాల్గొంటారు. బాలాపూర్ గణేశ్ లడ్డూకు ప్రత్యేక విశిష్టత ఉంది. లక్షల్లో వేలం పాట ద్వారా దీనిని సొంతం చేసుకుని పొలాల్లో చల్లితే సమృద్ధిగా పంటలు పండతాయని విశ్వసిస్తారు.
నిమజ్జనం కోసం...
ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి తరలి రావడంతో ట్యాంక్ బండ్ కోలాహలంగా ఉంటుంది. బ్రిటీష్ కాలం నుంచి హైదరాబాద్ లో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తూ స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించేలా నిర్వహించే వారు. అది సంప్రదాయంగా మారింది. గణేశ్ నిమజ్జనం రోజున హైదరాబాద్ లోని జంటనగరాలకు సెలవులను ప్రభుత్వం ప్రకటిస్తుంది. హైదరాబాద్ లోని ప్రతి వీధిలో గశేశ్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తారు. పదకొండు రోజుల పాటు పూజలందుకేనే గణపయ్య నిమజ్జనం జరిగేంత వరకూ కోలాహాలమైన వాతావరణం నెలకొంటుంది. ఒకప్పుడు హైదరాబాద్‌లోనే ఎక్కువగా జరిగే ఈ గణేశ్ నిమజ్జన ఊరేగింపు ఇప్పుడు అన్ని పట్టణాలు, గ్రామాల్లో కూడా ప్రారంభమయింది. ఈ గణేశ్ ఉత్సవాలను 1892 లో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారు.