Numaish : నుమాయిష్ కు హెచ్ఎంపీవీ వైరస్ ఎఫెక్ట్.. రావడానికి జనం భయపడతారా?

నుమాయిష్ కు ఆదివారం సెలవులు దినాల్లో మాత్రం లక్షల సంఖ్యలో జనం వస్తారు. మూడు వందలకు పైగా స్టాళ్లను ఏర్పాటుచేశారు;

Update: 2025-01-07 12:10 GMT

జనవరి నెలలో హైదరాబాద్ లో జరిగే నుమాయిష్ అంటే హైదరాబాద్ నగర వాసులుకు మాత్రమే కాదు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎగ్జిబిషన్ కు వస్తారు. సెలవు దినాల్లో ఇసుకవేస్తే రాలనంత మంది జనం వస్తారు. ఎగ్జిబిషన్ లో నడిచేందుకు కూడా వీలు కాని పరిస్థితులు సెలవు దినాల్లో ఉంటాయి. దేశం నలుమూలల దొరికే అన్ని వస్తువులు ఎగ్జిబిషన్ లో లభించడమే ఇందుకు కారణం. చౌక ధరలకు అన్ని వస్తువులు అందుబాటులో ఉండటంతో కొనుగోలుకు ఎక్కువ మంది వస్తారు. ఈ ఏడాది నుమాయిష్ ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయింది. ప్రతి ఏటా జనవరి ఒకటోతేదీ ప్రారంభం కావాల్సి ఉన్నా మన్మోహన్ సింగ్ మృతితో మూడోతేదీన నుమాయిష్ ను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమయింది.

సెలవుదినాల్లో మరింతగా...
ఇక నుమాయిష్ కు ఆదివారం సెలవులు దినాల్లో మాత్రం లక్షల సంఖ్యలో జనం వస్తారు. మూడు వందలకు పైగా స్టాళ్లను ఏర్పాటుచేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న అన్ని రాష్ట్రాల స్టాళ్లలో అక్కడి వస్తువులు ఈ నుమాయిష్ లో లభ్యమవుతాయి. అందుకోసమే జనం పోటెత్తుతుంటారు. ఇక ఫుడ్ స్టాల్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక్కడకు వచ్చి తమకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేయడమే కాకుండా కుటుంబసభ్యులతో కలసి వచ్చిఇక్కడ ఎంజాయ్ చేస్తారు. తమకు ఇష్టమైన ఆహారాన్ని తింటారు. ఇక చిన్నారులను అయితే అనేక ఆటలు ఎగ్జిబిషన్ లో అలరిస్తాయి. తక్కువ ఖర్చుతో కావాల్సినంత ఆనందాన్నిఅందిపుచ్చుకుంటూ గంటల సేపు అక్కడే గడుపుతారు.
మార్గదర్శకాలను జారీ చేయడంతో...
అయితే ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అన్ని రాష్ట్రాలను వణికిస్తుంది. భారత్ లో ఇప్పటికే  ఎనిమిది వరకూ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, గుజరాత్ లో ఇప్పటికే మూడు హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకిన మూడు రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. జలుబు, దగ్గు,జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి వస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. గుంపులో తిరగవద్దని, షేక్ హ్యాండ్ ఇవ్వవద్దంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హెచ్ఎంపీవీ ఎఫెక్ట్ నుమాయిష్ పై పడే అవకాశముందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నుమాయిష్ కు వచ్చే వారి సంఖ్య తగ్గే అవకాశాలు లేకపోలేదన్న అంచనాలు వినపడుతున్నాయి. మొత్తం మీద నుమాయిష్ కు హెచ్ఎంపీవీ వైరస్ ఎఫెక్ట్ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది చూడాల్సి ఉంది.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News