Maharashtra Elections : ఎంఐఎం ఆ యాభై నియోజకవర్గాల్లో ఓట్లు చీలుస్తుందా?

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈసారి కూడా ఎంఐఎం పోటీ చేయనుంది

Update: 2024-10-15 12:38 GMT

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మహారాష‌్ట్రలో నవంబరు 20వ తేదీన, జార్ఖండ్ లో నవంబరు 13, 20వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 23వ తేదీన జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా న్నికలు జరగనున్నాయి. రెండు లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగుతాయి. కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 48 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరగనుండగా, జార్ఖండ్ లోని 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

పోటీకి ఎంఐఎం అభ్యర్థులు...
దీంతో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పోటీకి దిగనుంది. గతంలోనూ మహారాష్ట్రలోనూ ఎంఐఎం పోటీకి కొన్ని స్థానాల్లో విజయం సాధించింది. ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం తన విజయాన్ని నమోదు చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో గత ఎన్నికల్లో ఇద్దరు ఎంఐఎం అభ్యర్తులు విజయం సాధించారు. మహారాష్ట్ర ఫలితాలను చూసిన తర్వాతనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా పార్టీని విస్తరించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. బీహార్ లో కూడా తర్వాత జరిగిన ఎన్నికల్లో బోణీ కొట్టింది. అక్కడ కీలకంగా మారింది. అలాగే ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం ఇవ్వలేదు. ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో పోటీ చేసేందుకు ఎంఐఎం ఉద్యుక్తులవ్వడానికి ప్రధాన కారణం మహారాష్ట్ర ఎన్నికలే కావడం విశేషం.
యాభై నియోజకవర్గాలలో...
మహారాష్ట్రలో గతంలో జరిగిన ఎన్నికల్లో ఔరంగాబాద్ సెంట్రల్ నుంచి, ముంబై నగరంలోని బైకాల నియోజకవర్గం నుంచి అభ్యర్తులు ఎంఐఎం పార్టీ తరుపున గెలవడంతో ఎంఐఎంలో ఊపు వచ్చింది. హైదరాాద్ కే పరిమితమైన పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు మహారాష్ట్ర ఎన్నికలు దోహదపడ్డాయని అసదుద్దీన్ ఒవైసీ పలుమార్లు తెలిపారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఎంఐఎం కొన్ని నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ గా ఉంది. అక్కడి నుంచి నేతలు టిక్కెట్ల కోసం హైదరాబాద్ చేరుకున్నారు. తమకు టిక్కెట్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకునే కార్యక్రమం కూడా మొదలయింది. అయితే ఎంఐఎం పోటీ చేయడం వల్ల కొన్ని రాజకీయ పార్టీలకు ఇబ్బందిగా మారుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలిపోయి, అది బీజేపీకి లాభం చేకూర్చిందన్న విమర్శలను అసదుద్దీన్ ఒవైసీ ఎదుర్కొన్నారు.
బలంగా ఇండి కూటమి...
ముస్లిం ఓట్లను చీల్చడంలో అసదుద్దీన్ సక్సెస్ కావడంతో దాదాపు యాభై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారన్న విశ్లేషణలు అప్పట్లో వెలువడ్డాయి. అయితే ఇప్పటికీ ఎంఐఎం ఇండి కూటమిలో నేరుగా చేరలేదు. ఈసారి కూడా విడిగా పోటీ చేసే అవకాశముందని చెబుతున్నారు. బీజేపీ చేతిలో అసద్ పావుగా మారారన్న విమర్శలను సయితం ఆయన లెక్క చేయడం లేదు. తాము ఒంటరిగా బరిలోకి దిగి తాడో పేడో తేల్చుకుందామని చెబుతుంటే మరొకసారి యాభై నియోజకవర్గాల్లో ఎంఐఎం ఇండి కూటమిని దెబ్బతీసే అవకాశాలున్నాయి. అయితే ఈసారి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీలతో ఇండి కూటమి స్ట్రాంగ్ గా ఉందంటున్నారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గంతో పాటు బీజేపీ కలసి పోటీ చేయనుంది. ప్రభుత్వాన్ని చీల్చి మరీ ప్రభుత్వాన్ని ఏర్పరచడం, ఉద్దవ్ థాక్రేను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశాలున్నాయి. మరి ఈసారి మహారాష్ట్రలో ఎవరిది గెలుపు అన్నది మాత్రం ఎంఐఎం చేతుల్లోనే ఉందంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News