స్వీట్ షాప్ లో బాంబ్ బ్లాస్ట్

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో.. రద్దీగా ఉండే మార్కెట్‌లో శుక్రవారం ఒక దుకాణంలో పేలుడు సంభవించింది.

Update: 2022-09-30 12:17 GMT

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో.. రద్దీగా ఉండే మార్కెట్‌లో శుక్రవారం ఒక దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. 20 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కోహ్లు పట్టణంలోని ప్రధాన మార్కెట్‌లోని ఓ స్వీట్ షాపులో ఈ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు సంభవించిన తర్వాత 21 మందిని ఆస్పత్రికి తరలించినట్లు కోహ్లు జిల్లా ప్రధాన కార్యాలయం (డీహెచ్‌క్యూ) ఆస్పత్రి సూపరింటెండెంట్ అస్గర్ మర్రి తెలిపారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న వారిని డేరా ఘాజీ ఖాన్‌లోని ఆసుపత్రికి తరలించారని అస్గర్ మర్రి చెప్పారు. బాంబు దాడికి బాధ్యులమని తామేనని ఎవరూ ప్రకటించలేదు.

ప్రాథమిక పోలీసు దర్యాప్తు ప్రకారం ఇది రిమోట్ కంట్రోల్ ద్వారా బాంబు పేలుడు చోటు చేసుకుందని తెలిపారు. బాంబ్ డిస్పోజల్ టీమ్ ఘటనాస్థలికి చేరుకుందని, పేలుడు జరిగిన తీరును త్వరలోనే నిర్ధారిస్తామని అధికారులు చెప్పారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆత్మాహుతి దాడులు, రిమోట్ కంట్రోల్డ్ బాంబు పేలుళ్లతో సహా.. ఇతర దాడులు తరచుగా జరుగుతూ ఉంటాయి.


Tags:    

Similar News