భారీ వర్షం.. పై కప్పు కూలి 11 మంది మృతి
మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన ఈశాన్య చైనాలోని హీలాంగ్ జియాంగ్ ప్రావిన్సులోని క్వికిహార్ లో..
భారీ వర్షాలు భారత్ నే కాదు.. చైనాను కూడా వణికిస్తున్నాయి. కొద్దిరోజులుగా అక్కడ కురుస్తున్న భారీవర్షాలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షం కారణంగా ఓ స్కూల్ లో జిమ్ పై కప్పు కూలడంతో 11 మంది మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన ఈశాన్య చైనాలోని హీలాంగ్ జియాంగ్ ప్రావిన్సులోని క్వికిహార్ లో 34వ నంబర్ మిడిల్ స్కూల్ లో జరిగింది. సోమవారం ఉదయం 5.30 గంటల నాటికి శిథిలాల్లో నుంచి 14 మందిని రక్షించారు. మరో నలుగురి మృతదేహాలను వెలికి తీశారు.
చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ఆరుగురు మృతి చెందారని స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 160 అగ్నిమాపక సిబ్బంది, 39 ట్రక్కులతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగానే జిమ్ పై కప్పు కూలినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం సదరు జిమ్ నిర్మాణ సంస్థ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.