ఓ వైపు డ్రగ్స్ కింగ్ అరెస్ట్.. మరో వైపు నేవీ హెలికాఫ్టర్ కూలింది
ఓ వైపు డ్రగ్స్ కింగ్ అరెస్ట్.. మరో వైపు నేవీ హెలికాఫ్టర్ కూలింది
మెక్సికో: ఉత్తర రాష్ట్రమైన సినాలోవాలో బ్లాక్ హాక్ మిలిటరీ హెలికాప్టర్ కూలిపోవడంతో 14 మంది మరణించారని, మరొకరు గాయపడ్డారని మెక్సికో నేవీ తెలిపింది. ఈ క్రాష్ కు కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. మెక్సికో డ్రగ్స్ కింగ్ రాఫెల్ కారో క్వింటెరో అరెస్టు సమయంలో ఈ మిలిటరీ హెలీకాఫ్టర్ కూలిపోయిందా అనే విషయంలో నేవీ నుండి ఖచ్చితమైన ప్రకటన రాలేదు.
శుక్రవారం నాడు మెక్సికో నావికాదళం 1985లో US యాంటీ-నార్కోటిక్ ఏజెంట్‌ను హత్య చేసినందుకు దోషిగా తేలిన పేరుమోసిన డ్రగ్ కింగ్.. రాఫెల్ కారో క్వింటెరోను పట్టుకుంది.
రాఫెల్ కారో క్వింటెరో 1980లలో లాటిన్ అమెరికాలో డ్రగ్స్ దందా మొదలైనప్పటి నుండి ఉన్నాడు. అత్యంత శక్తివంతమైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా సంస్థలలో ఒకటైన గ్వాడలజారా కార్టెల్ సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. అమెరికా అధికారులు ఈ డ్రగ్స్ గ్యాంగ్ ను పట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తూ వస్తున్నారు. తాజాగా రాఫెల్ కారో క్వింటెరో అరెస్ట్ చేయడంతో అమెరికా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. US ప్రభుత్వం రాఫెల్ కారో క్వింటెరో అరెస్టును ప్రశంసించింది. అతనిని అప్పగించమని అమెరికా అభ్యర్థించింది. ఇది చాలా పెద్ద అరెస్ట్ అని వైట్ హౌస్ సీనియర్ లాటిన్ అమెరికా సలహాదారు జువాన్ గొంజాలెజ్ ట్విట్టర్‌లో తెలిపారు. మెక్సికో మాదకద్రవ్యాల రవాణా కేంద్రాలలో ఒకటైన వాయువ్య రాష్ట్రమైన సినాలోవాలోని చోయిక్స్ మునిసిపాలిటీలో కారో క్వింటెరో పట్టుబడ్డారని మెక్సికన్ నేవీ ఒక ప్రకటనలో తెలిపింది.
మాక్స్ అనే మిలిటరీ-శిక్షణ పొందిన మహిళా అధికారి ద్వారా రాఫెల్ కారో క్వింటెరో కనుగొనబడ్డాడని నేవీ తెలిపింది. అతన్ని వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని.. యునైటెడ్ స్టేట్స్ నుండి ఒత్తిడి రావడంతో మెక్సికో దళాలు అప్రమత్తమై అతడిని పట్టుకున్నాయి. అదే వారంలో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ US అధ్యక్షుడు జో బిడెన్‌తో వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు.
కారో క్వింటెరో మాజీ US డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) ఏజెంట్ ఎన్రిక్ "కికి" కమరేనాను క్రూరంగా హత్య చేసినందుకు 28 సంవత్సరాలు జైలులో గడిపాడు. కారో క్వింటెరో గతంలో కమరేనా హత్యలో ప్రమేయాన్ని ఖండించారు. 2013లో మెక్సికన్ న్యాయమూర్తి అతడిని విడుదల చేశారు. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు.. సినాలోవా కార్టెల్‌లో భాగంగా తిరిగి డ్రగ్స్ అక్రమ రవాణామొదలుపెట్టాడు. U.S. అధికారుల ప్రకారం.. అతన్ని FBI యొక్క టాప్ 10 మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. అతని తలపై రికార్డు స్థాయిలో $20 మిలియన్ల బహుమతిని పెట్టారు. గత సంవత్సరం, అతను యునైటెడ్ స్టేట్స్‌కు అప్పగించడానికి వ్యతిరేకంగా చేసిన తుది అప్పీల్‌ను కోల్పోయాడు.