ఇండోనేషియాలో భూకంపాల విధ్వంసం.. 162కి పెరిగిన మృతులు
తొలుత జావాలో 5.6 తీవ్రతతో భూ కంపం సంభవించింది. అప్పుడే 46 మంది ప్రాణాలు కోల్పోయారు. సాయంత్రం వరకు ఈ ప్రాంతంలో..
ఇండోనేషియాలో సోమవారం మధ్యాహ్నం నుండి పలుమార్లు భూమి కంపించింది. ఈ ప్రకృతి విపత్తులో మరణించిన వారి సంఖ్య 162కి పెరిగింది. ఈ మేరకు ఇండోనేషియా జాతీయ విపత్తుల సంస్థ ప్రకటన చేసింది. 10 గంటల వ్యవధిలో 62 సార్లు కంపించిన భూమి.. అక్కడి ప్రజలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. భవనాలు, నిర్మాణంలో ఉన్న కట్టడాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. 700 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. పదే పదే భూమి కంపిస్తుండటం అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు.
తొలుత జావాలో 5.6 తీవ్రతతో భూ కంపం సంభవించింది. అప్పుడే 46 మంది ప్రాణాలు కోల్పోయారు. సాయంత్రం వరకు ఈ ప్రాంతంలో 1.5 నుంచి 4.8 తీవ్రతతో పలుమార్లు కంపించింది. రాత్రి 9.16 గంటల ప్రాంతంలో పాపువా దీవుల్లో 5.1 తీవ్రతతో సంభవించిన భూకంపం జనావాసాలను నేలమట్టం చేసింది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జావాలోని సియాంజుర్ నగరం కేంద్రంగా భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించింది. దాదాపు 15 సెకన్లపాటు భూమి కంపించడంతో జావా ద్వీపం వణికిపోయింది. భూకంపం ధాటికి సియాంజుర్‌లో ఓ స్కూలు, ప్రాంతీయ ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాలు, ఓ ప్రార్థనా మందిరం, మూడు పాఠశాలల గోడలు కుప్పకూలాయి. నేలమట్టమైన ఇళ్లు, భవనాల శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉండవచ్చని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా.. ఇప్పటి వరకూ అక్కడ ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు.