భారీ భూకంపం.. 7.1 తీవ్రతతో..!

భారీ భూకంపం.. 7.1 తీవ్రతతో..!

Update: 2022-07-27 06:07 GMT

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని లుజాన్‌ ఐలాండ్స్‌లో ఉన్న అబ్రా ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం భూమి కంపించింది. దీని తీవ్రత 7.1గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీట్ల దూరంలో ఉన్న మనీలాలో భారీ భవనాలు ఊగిపోయాయని తెలిపింది. భారీ భూకంపం నేపథ్యంలో డాలర్స్‌ పట్టణంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు ఇద్దరు మరణించగా.. డజన్లలో గాయపడ్డారు.

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ భూకంపం ప్రభావిత ప్రావిన్స్ అబ్రాకు తక్షణమే రెస్క్యూ మరియు రిలీఫ్ టీమ్‌లను పంపాలని ఆదేశించినట్లు ఆయన ప్రెస్ సెక్రటరీ తెలిపారు. భూ ప్రకంపణల వల్ల ఎంతమేర నష్టం జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. భయాందోళనకు గురైన ప్రజలు తమ భవనాల వెలుపలికి పరుగులు తీశారని పోలీసు అధికారిని ఉటంకిస్తూ AFP నివేదించింది. "భూకంపం చాలా తీవ్రంగా ఉంది," పోలీసు మేజర్ ఎడ్విన్ సెర్గియో చెప్పుకొచ్చారు. పోలీసు స్టేషన్ భవనంలో కూడా చిన్న పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. చిన్న కొండచరియలు విరిగిపడి భవనాలు, చర్చిలను ధ్వంసం చేసింది. భూకంపం తర్వాత అనేక ప్రకంపనలు సంభవించాయని ఫిలిప్పీన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సిస్మాలజీ తెలిపింది. పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్.. ప్రపంచంలోని అత్యంత విపత్తు-పీడిత దేశాలలో ఒకటిగా నిలిచింది.
1990లో ఉత్తర ఫిలిప్పీన్స్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 2,000 మంది మరణించారు. 2013లో సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌లోని బోహల్‌ ద్వీపంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో 200 మంది మరణించారు. 4 లక్షల మందికిపైగా నిరాశ్రయులు అయ్యారు.


Tags:    

Similar News