వడదెబ్బతో విద్యార్థి మృతి.. భారీ మూల్యం చెల్లించుకున్న యూనివర్సిటీ యాజమాన్యం
ఇదంతా శిక్షణలో భాగమని, ఎవరూ అతనికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వొద్దంటూ అడ్డుపడ్డారు. దీంతో డీహైడ్రేషన్‌కు గురైన బ్రేస్..
వడదెబ్బ తగిలి దాహంతో అల్లాడుతున్న విద్యార్థికి గుక్కెడు నీళ్లిచ్చేందుకు ఓ యూనివర్సిటీ నిరాకరించడంతో.. అతను మరణించాడు. ఫలితంగా సదరు యూనివర్సిటీ యాజమాన్యం అతని కుటుంబానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. అమెరికాలోని కెంటకీ యూనివర్సిటీలో 2020లో రెజ్లింగ్‌కు సంబంధించి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో బ్రేస్ అనే 20 ఏళ్ల యువకుడు పాల్గొన్నాడు. రెజ్లింగ్ శిక్షణలో బ్రేస్ వడదెబ్బకు గురై.. ఆగస్టు 31న తీవ్ర అస్వస్థత చెందాడు. తనకు తీవ్రమైన దాహంగా ఉందని, తాగేందుకు మంచినీళ్లు ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. అక్కడున్న కోచ్ లు అందుకు నిరాకరించారు.
ఇదంతా శిక్షణలో భాగమని, ఎవరూ అతనికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వొద్దంటూ అడ్డుపడ్డారు. దీంతో డీహైడ్రేషన్‌కు గురైన బ్రేస్ కొద్దిసేపటికే మరణించాడు. తమ కుమారుడి మరణానికి యూనివర్సిటీ యాజమాన్యమే కారణమని, తమ కుమారుడిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మృతి చెందాడంటూ బ్రేస్ కుటుంబ సభ్యులు కోర్టులో దావా వేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. దాంతో కోర్టు ఆదేశం మేరకు సదరు యూనివర్సిటీ 14 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. మన కరెన్సీలో అక్షరాలా రూ.115 కోట్లు. బ్రేస్ శిక్షణలో పాల్గొన్నసమయంలో ఉన్న ఇద్దరు కోచ్ లు రాజీనామా చేశారని, అతని అకాల మరణంపట్ల చింతిస్తున్నామని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది.