నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో నదిలో పడవ బోల్తా పడడంతో అందులో ఉన్న దాదాపు అందరూ మరణించారని అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ఆదివారం నాడు తెలిపారు. శుక్రవారం నాడు 85 మంది తో పడవను తీసుకెళ్తుండగా నైజర్ నదికి వరదలు రావడంతో అది బోల్తా పడింది. ఓవర్ వెయిట్ తో ఆ పడవలో జనాలను కుక్కేశారని నైజీరియా అధికారులు వెల్లడించారు.
"రాష్ట్రంలోని ఓగ్బారు ప్రాంతంలో వరదల కారణంగా 85 మంది ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది, అత్యవసర సేవలు మొత్తం 76 మంది మరణించినట్లు నిర్ధారించాయి" అని బుహారీ కార్యాలయం తెలిపింది. బాధితులను ఆదుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. "బాధితుల ఆత్మకు శాంతి కలగాలని, ప్రతి ఒక్కరి భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నాను, అలాగే ఈ విషాద ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను" అని ఆయన తెలిపారు. నీటి ఉధృతి చాలా ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా ప్రమాదకరమని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (NEMA) ఆగ్నేయ కోఆర్డినేటర్ థిక్‌మన్ తానిము AFP కి చెప్పారు. ఈ వరదలు దేశంలో ఎన్నాళ్లుగానో ఎన్నడూ చూడనంత దారుణమని ఆయన అన్నారు.
రెస్క్యూ ఆపరేషన్ కోసం నైజీరియా వైమానిక దళం హెలికాప్టర్లను అందించాలని NEMA అభ్యర్థించింది. అనంబ్రా రాష్ట్ర గవర్నర్ చార్లెస్ సోలుడో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల నివాసితులను తరలించాలని కోరారు, అదే సమయంలో విపత్తులో ప్రభావితమైన వారికి ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. ఓవర్‌లోడింగ్, స్పీడ్, పేలవమైన నిర్వహణ, నావిగేషన్ నియమాలను పట్టించుకోకపోవడం వల్ల నైజీరియాలో బోట్ ప్రమాదాలు సర్వ సాధారమయ్యాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి, 200 మిలియన్లకు పైగా జనాభా ఉన్న పశ్చిమ ఆఫ్రికా దేశంలోని అనేక ప్రాంతాలు వరదల వల్ల నాశనమయ్యాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.