భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ .. ఇండియాకూ ముప్పు ?
ఆగ్నేయ ఆసియా దేశమైన ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావం ఇండియాపై కూడా ఉండనుంది
ఆగ్నేయ ఆసియా దేశమైన ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ద్వీపాల సముదాయమైన ఇండోనేషియాలో ప్రకృతి అంతాలకు నెలవైన ఫ్లోరెస్ దీవులకు సమీపంలో మంగళవారం ఉదయం 11.20 నిమిషాల సమయంలో భూకంపం వచ్చినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సముద్రంలో వచ్చిన ఈ భూకంపం వల్ల సునామీ రావొచ్చని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఫ్లోరెస్ ద్వీపంలోని అతిపెద్ద పట్టణం మౌమెరే తీరానికి ఉత్తరంగా 100 కిలోమీటర్ల దూరం భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సముద్రంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం రాగా.. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.7 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇండియాపై కూడా....
ఇండోనేషియా భూకంప శాస్త్ర ఏజెన్సీ, అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థలు భూకంపం తీవ్రతను నిర్ధారించాయి. ఈ భారీ భూకంపం సముద్రంలోపల రావడంతో.. సునామీ రావొచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ సునామీ ఇండియాపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయి. సునామీ హెచ్చరికలతో ఇండోనేషియా వాసులు వణికిపోతున్నారు. ఇండోనేషియా కేంద్రంగా 2004లో చివరిసారిగా సునామీ తలెత్తిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సముద్ర గర్భంలో 9.1 తీవ్రతతో భూకంపం రావడంతో.. ఆ సునామీ ప్రభావం ఇండోనేషియాతో పాటు శ్రీలంక, ఇండియా, థాయిలాండ్ సహా తొమ్మిదిదేశాల్లోని తీరాలను ముంచేసింది. అప్పటి జలప్రళయంలో అధికారుల లెక్కల ప్రకారం సుమారు 2,27,898 మంది మరణించారు. కాగా.. తాజాగా జారీ అయిన సునామీ హెచ్చరికల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.