జర్మనీలో మోదీ పర్యటన.. పిల్లాడి పాటకు చిటికెలు !

బెర్లిన్ విమానాశ్రయంలో మోదీకి అధికారులు, ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో ..

Update: 2022-05-02 09:49 GMT

బెర్లిన్ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేటి నుంచి మూడ్రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా నేడు మోదీ జర్మనీ చేరుకున్నారు. బెర్లిన్ విమానాశ్రయంలో మోదీకి అధికారులు, ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా మోదీ జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ దేశాలు సందర్శించనున్నారు. ఆయా దేశాల అధినేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించి, ఐరేపా దేశాలతో భారత్ బంధాన్ని పటిష్టం చేసే దిశగా మోదీ చర్చలు జరపనున్నారు.

కాగా.. బెర్లిన్ విమానాశ్రయంలో చిన్నారులు మోదీకి అపూర్వంగా స్వాగతం పలికారు. ఓ బాలిక మోదీ చిత్రపటాన్ని గీసి బహుకరించగా.. మోదీ దానిపై సంతకం చేసి బాలికను అభినందించారు. మరో బాలుడు భారతదేశ భక్తి గీతాన్ని ఆలపించగా.. మోదీ అందుకు అనుగుణంగా చిటికెలు వేసి బాలుడిని ఉత్సాహ పరిచారు. అందుకు సంబంధించిన వీడియోను నేషనల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. కానీ భారత్ మాత్రం ఈ యుద్ధంపై తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని ఐరోపా దేశాల్లో పర్యటిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్ర‌స్తుతం ఐరోపా దేశాలు ఇంధన సమస్యలను ఎదుర్కొంటోన్న నేప‌థ్యంలో ఈ సమస్యపైనే ప్రధానంగా చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బెర్లిన్‌లో జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఈ తర్వాత ఇండియా జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (IGC) 6వ ఎడిషన్‌‌లో ప్రధాని మోదీ, జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్ పాల్గొననున్నారు.

అనంతరం డెన్మార్క్‌ ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్‌హాగన్ వెళ్లనున్నారు. అక్కడ డెన్మార్క్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తున్న 2వ ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్‌లాండ్ దేశాల ప్రధానమంత్రులతో మోదీ చర్చించనున్నారు. కరోనా అనంతరం ఆర్ధిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నూతన ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మే4న ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో ప్యారిస్‌లో ఆగి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇటీవల తిరిగి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో చర్చలు జరుపుతారు.









Tags:    

Similar News