ఘోర అగ్నిప్రమాదం.. 40 మంది సజీవదహనం
ఈ ఘటన మెక్సికోలో కలకలం రేపింది. ప్రమాదంలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వలస ప్రజల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో..
మెక్సికో - అమెరికా సరిహద్దుల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 40 మంది బతుకులు సజీవ శిథిలమయ్యాయి. నేషనల్ మైగ్రేషన్ ఇనిస్టిట్యూట్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అమెరికా బోర్డర్‌కు దగ్గరలోని ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన మెక్సికోలో కలకలం రేపింది. ప్రమాదంలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వలస ప్రజల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో మంటలు చెలరేగడంతో సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. గత రాత్రి 10 గంటల సమయంలో శిబిరంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో శిబిరంలో మొత్తం 68 మంది ఉన్నట్టు అధికారులు ప్రకటించారు.
మెక్సికోలోని నేషనల్ మైగ్రేషన్ ఇనిస్టిట్యూట్ అనే ప్రభుత్వ సంస్థ వలసదారుల రెగ్యులేషన్ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. అమెరికా వెళ్లేందుకు జనం గుమిగూడినపుడు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడున్నవారిలో చాలామంది వెనిజులాకి చెందినవారని సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సులలో ఆస్పత్రులకు తరలించారు. కాగా.. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఐఎన్ఎం వెల్లడించింది.