భార్యతో ప్రధాని ఆనందంగా లేరట

Update: 2023-08-03 02:27 GMT

ప్రస్తుత కాలంలో ఎన్నో పెళ్లిళ్లు పెటాకులు అవుతూ ఉన్నాయి. అందులో సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు..! ఎన్నో ఏళ్ల వివాహ బంధాలకు కూడా వీడ్కోలు పలకాల్సి వస్తోంది. ఆ లిస్టులోకి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన భార్య సోఫీ కూడా చేరారు. తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని వారు స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్‌పై ఇరువురు సంతకాలు కూడా చేసినట్టు ట్రూడో కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రూడో(51), సోఫీ(48) 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

"చాలా అర్థవంతమైన, సుదీర్ఘ చర్చల తర్వాత, మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాము అనే వాస్తవాన్ని సోఫీ, నేను పంచుకోవాలనుకుంటున్నాము" అని ట్రూడో ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. 2015లో అధికారం చేపట్టిన తర్వాత ట్రూడోకు ఎదురైన అతి పెద్ద వ్యక్తిగత సంక్షోభాలలో ఈ పరిణామం ఒకటి. ఎన్నికలలో తన లిబరల్ పార్టీ స్థానాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన గణనీయమైన క్యాబినెట్ షఫుల్‌ను ఆవిష్కరించినప్పుడు ఇది జరిగింది. ప్రస్తుతం జనాదరణ పరంగా వెనుకబడినప్పటికీ అక్టోబర్ 2025లో జరగనున్న ఎన్నికలలో లిబరల్స్‌కు నాయకత్వం వహించాలని ట్రూడో నిశ్చయించుకున్నారు. అచ్చం తండ్రి జీవితంలో జరిగినట్లే జస్టిన్ ట్రూడో జీవితంలోనూ జరిగిందంటూ సోషల్ మీడియా యూజర్లు గుర్తు చేస్తున్నారు. ట్రూడో తండ్రి, మాజీ ప్రధాన మంత్రి పియరీ ట్రూడో, 1977లో పదవిలో ఉన్నప్పుడు అతని భార్య మార్గరెట్ నుండి విడిపోయారు.


Tags:    

Similar News