భారత్ ను మళ్లీ రెచ్చగొడుతున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్ లో 11 ప్రాంతాల పేర్లు మార్పు

తొలివిడతలో అరుణాచల్ ప్రదేశ్ లోని ఆరు ప్రాంతాలకు, 2021 లో 15 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టింది. ఇప్పుడు మూడో విడతలో..

Update: 2023-04-04 07:00 GMT

china renames 11 places in arunachalam

చైనా మరోసారి భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. మనదేశంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ను చైనా తమ దేశంలో దక్షిణ టిబెట్‌లోని జంగ్నమ్‌గా పేర్కొంటూ మూడో విడత పలు ప్రాంతాల పేర్లను మార్చుతూ ప్రకటన విడుదల చేసింది. చైనా కేబినెట్ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలను అనుసరించి చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వశాఖ తాజాగా చైనీస్, టిబెటన్, పిన్యిన్ అక్షరాలతో ప్రామాణిక పేర్లను విడుదల చేసింది. మొత్తం 11 ప్రాంతాలకు పేర్లు పెట్టనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

ఈ జాబితాలో రెండు భూభాగాలు, ఐదు పర్వత శిఖరాలు, రెండు నదులతోపాటు సబార్డినేట్ అడ్మినిస్ట్రేటివ్ జిల్లాలు ఉన్నాయి. చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఈ విషయాన్ని వెల్లడించింది. 2017లో తొలివిడతలో అరుణాచల్ ప్రదేశ్ లోని ఆరు ప్రాంతాలకు, 2021 లో 15 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టింది. ఇప్పుడు మూడో విడతలో 11 ప్రాంతాలకు పేర్ల పెట్టడమే కాకుండా.. పేర్ల ప్రకటన చట్టబద్ధమైన చర్య అని, అది చైనా సార్వభౌమ హక్కు అని చైనా నిపుణులను ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గతంలో చైనా చేసిన ఈ పనిపై భారత్ తీవ్రంగా మండిపడుతూ.. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లోని అంతర్భాగమేనని తేల్చిచెప్పింది. స్థలాల పేర్లను మార్చినంత మాత్రాన వాస్తవాన్ని ఎవరూ దాచలేరని భారత్ అభిప్రాయపడింది.




Tags:    

Similar News