చైనాలో కరోనా కల్లోలం.. ఆక్సిజన్ సిలిండర్లకు పెరిగిన డిమాండ్
రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.
చైనాలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న ఏకంగా 40 వేల పై చిలుకు కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. దాంతో చాలాకాలంగా ఆంక్షలతో విసిగిపోయిన ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీరో కోవిడ్ పాలసీ విషయంలో కొన్ని ఆంక్షలను సవరించాలని భావిస్తున్నప్పటికీ.. లాక్ డౌన్లను ఎత్తేస్తే కొవిడ్ కేసులు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతాయని అక్కడి ప్రభుత్వం గాబరా పడుతోంది.
కోవిడ్ కేసులు మళ్లీ తారాస్థాయికి చేరుకుంటుండటంతో.. వెంటిలేటర్లు, ఆక్సిజన్ యంత్రాలు, సిలిండర్లకు అక్కడ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. బ్రిటన్ డైయిలీ ఫైనాన్షియల్ టైమ్స్ కథనం మేరకు చైనాలో 1.20 కోట్ల మంది వీటిని కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. చైనా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ చికిత్సకు అరకొర సదుపాయాలు మాత్రమే ఉన్నాయి. దాంతో ముందుజాగ్రత్తగా లైఫ్ సేవింగ్ పరికరాల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నట్టు ఆ కథనం పేర్కొంది.