ప్రకృతి ప్రకోపానికి 4500 మంది మృతి
భూకంప ధాటికి టర్కీలో 3 వేలమందికి పైగా చనిపోగా.. 16వేల మందికి గాయాలయ్యాయి. సిరియాలో 1500 మందికిపైగా..
ప్రకృతి కన్నెర్ర చేస్తే.. ఎంత భయంకరంగా ఉంటుందో.. ప్రస్తుతం టర్కీ, సిరియా దేశాల పరిస్థితుల్ని చూస్తుంటే అర్థమవుతోంది. వరుస భూకంపాలతో చిగురుటాకులా వణికిపోతున్నాయి. రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భూకంపాలకు ఇరు దేశాల్లో మరణ మృదంగం మోగుతోంది. శిథిలమైన భవనాల కింద.. వెతికే కొద్దీ.. మృతదేహాలు బయటపడుతున్నాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంపం దాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 4,500లకు పైగా మంది మృత్యువాత పడగా, వేలాదిగా ప్రజలు గాయపడ్డారు.
భూకంప ధాటికి టర్కీలో 3 వేలమందికి పైగా చనిపోగా.. 16వేల మందికి గాయాలయ్యాయి. సిరియాలో 1500 మందికిపైగా దుర్మరణం చెందారు. టర్కీలో ఇప్పటికీ భూమి దశలవారిగా కంపిస్తుండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఎటుచూసిన నేలమట్టమైన భవనాల శిథిలాలు, మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. కొన్నిప్రాంతాలు శవాలదిబ్బలుగా మారి.. భయానకంగా ఉన్నాయి. శిథిలాలు తొలగించే కొద్ది మృతదేహాలు బయటపడుతుండటంతో.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని, 10 వేలు దాట వచ్చని యూఎన్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది.