కనిపించిన వారిని కాల్చిపడేయండి

కనిపించిన వారిని కాల్చిపడేయండి

Update: 2022-07-13 12:43 GMT

శ్రీలంక దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోవడంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. అయితే విక్రమసింఘే కూడా రాజీనామా చేయాలని ఆందోళనకారులుఅంటున్నారు. విక్రమసింఘే కార్యాలయం పైకి ఎక్కి శ్రీలంక జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో దేశంలో ఎమర్జెన్సీని విధించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ఆర్మీకి పూర్తి అధికారాలు ఇచ్చారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఏది అవసరమైతే అది చేయాలని, అవసరమైతే కనిపించిన వారిని కాల్చిపడేయాలని వారికి స్పష్టం చేశారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తప్పుకునేలా చేయాలని విధ్వంసకారులు చూస్తున్నారని ఆయన చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు శ్రీలంక పోలీసులు, సైన్యానికి పూర్తి స్థాయి అధికారాలు ఇస్తున్నట్లు విక్రమ సింఘే స్పష్టం చేశారు.

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయిన సంగతి తెలిసిందే. భార్య, ఇద్దరు బాడీ గార్డ్స్ తో కలిసి ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆయన పరారయ్యారు. శ్రీలంక సైన్యానికి అధిపతి కూడా అయిన దేశాధ్యక్షుడికి ఉన్న కార్యనిర్వాహక అధికారాల ప్రకారమే ఆయన తరలింపు జరిగిందని ఆ దేశ వైమానిక దళం తెలిపింది. రాజపక్స స్వదేశం నుంచి పారిపోవడానికి భారత్ సాయం చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని శ్రీలంకలోని భారత హైకమిషన్ ఖండించింది. ఈ ప్రచారం నిరాధారమైనదని తెలిపింది. ఆందోళనకారుల నిరసనలతో లంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. శ్రీలంక ప్రధాని నివాసాన్ని వేలాది మంది ముట్టడించారు. ప్రధాని నివాసం గోడఎక్కి లోపలకు దూసుకెళ్లారు. ఆందోళనకారులని చెదరగొట్టేందుకు భద్రతాబలగాలు భాష్పవాయుగోళాలను ప్రయోగిస్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది.


Tags:    

Similar News