పాక్ లో వరదల బీభత్సం.. సహాయమందించేందుకు సిద్ధమవుతోన్న భారత్ ?
పర్వత ప్రాంతాల్లో వరదల కారణంగా వేల ఇళ్లు కూలిపోగా.. దాదాపు 8 లక్షల పశువులు చనిపోయాయి. 20 లక్షల హెక్టార్లలో పంటలు..
పాకిస్థాన్ లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో ఆ దేశంలోని సగానికి పైగా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. జులై నుంచి దేశంలో అసాధారణ రుతుపవనాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. మొత్తం 150 జిల్లాల్లోని 110 ప్రాంతాల్లో వదరలు వచ్చినట్లు పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) తెలిపారు. 2010లో వచ్చిన సూపర్ ఫ్లడ్ కంటే.. ఈ వరదలు తీవ్రంగా ఉన్నాయి. భారీ వరదల కారణంగా 1061 మంది మరణించగా.. 4,52,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. మరో 2,18,000 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి.
పర్వత ప్రాంతాల్లో వరదల కారణంగా వేల ఇళ్లు కూలిపోగా.. దాదాపు 8 లక్షల పశువులు చనిపోయాయి. 20 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ఎన్డీఎంఏ పేర్కొంది. భారీ వరదలపై పాక్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ వరదల కారణంగా చనిపోయినవారిలో మూడింట ఒకవంతు మంది పిల్లలే ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. కాగా.. వరదల్లో చిక్కుకున్న పాక్ ను కాపాడేందుకు సహాయక చర్యలకోసం యూకే ప్రభుత్వం 1.8 మిలియన్ డాలర్లు ఆర్థిక సాయం అందించింది. మరోవైపు భారత్ కూడా పాక్ కు సహాయం చేసేందుకు సిద్ధమవుతోందని జాతీయ మీడియా పేర్కొంది.
పాకిస్థాన్ లో వరదల బీభత్సాన్ని ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. పాకిస్థాన్ లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసం చూసి బాధపడ్డానని, ఈ ప్రకృతి వైపరిత్యంలో బాధిత కుటుంబాలకు, గాయపడిన వారికి, నష్టపోయిన వారందరికీ మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. త్వరగా ఆ దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాని కోరారు. వరదలతో అతలాకుతలం అవుతున్న పాకిస్థాన్ కు మానవతా సహాయం అందించే అవకాశంపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.