ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద పాక్ మాజీ ప్రధాని అరెస్ట్
ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసే సమయంలో కోర్టులో ఘర్షణ జరిగినట్లు సమాచారం. వందలాది మంది పాక్ రేంజర్లు ఇమ్రాన్ ను..
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ను పారామిలిటరీ దళాలు తమ కస్టడీలోకి తీసుకున్నాయి. ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో ఆయనను పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. తిరుగుబాటు కేసు, హత్యాయత్నం కేసులకు సంబంధించిన విచారణకు ఇమ్రాన్ ఖాన్ హాజరవగా..అక్కడే ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ పై పలు ఎఫ్ఐఆర్ లు నమోదైన నేపథ్యంలో.. బెయిల్ కోసం వెళ్లారు. ఈ సమయంలో ఇమ్రాన్ ను రేంజర్లు అరెస్టు చేశారని స్థానిక మీడియా వెల్లడించింది.
ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసే సమయంలో కోర్టులో ఘర్షణ జరిగినట్లు సమాచారం. వందలాది మంది పాక్ రేంజర్లు ఇమ్రాన్ ను తీసుకెళ్లిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పీటీఐ పార్టీ ఆయా వీడియోలను జత చేసి ట్వీట్ చేసింది. ఇమ్రాన్ ను అరెస్ట్ చేసేందుకు హైకోర్టు లోపలికి వెళ్లేందుకు రేంజర్లు ప్రయత్నించడం, అద్దాలను పగులగొట్టడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో ఇమ్రాన్ తరపు లాయర్లకు గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది.