కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం.. 40 మంది భారతీయుల మృతి
కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై మంది భారతీయులు మరణించారు.
కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై మంది భారతీయులు మరణించారు. ఈ అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది మరణించగా అందులో నలభై మంది భారతీయులేనని అధికారులు చెబుతున్నారు. వీరంతా కేరళకు చెందిన వారని తెలిసింది. దక్షిణ మంగాఫ్ నగరంలోని ఆరు అంతస్థుల భవనంలో ఈరోజుు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో ఆ భవనంలో 160 మంది వరకూ ఉన్నారని తెలిసింది. తొలుత వంట గదిలో ప్రారంభమైన మంటలు తర్వాత భవనమంతా చుట్టుముట్టాయి. ఈ భవనంలో ఉన్నవారంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ మంటల్లో 35 మంది సజీవ దహనమయ్యారు.
గాయపడిన వారిలో...
మరికొందరు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో మరో యాభై మందికి పైగా గాయపడ్డారని చెబుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో కొందరు మంటలను తాళలేక భవనంపై నుంచి దూకి గాయపడ్డారు. మరికొందరు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ కు చెందిన భవనంగా చెబుతున్నారు. భవనం కింద గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.