భూకంపాలను ముందే పసిగట్టనున్న జీపీఎస్?

నెవాడా విశ్వవిద్యాలయంలో ఉంచిన డేటాసెట్‌ను పరిశీలించారు. ప్రతి ఐదు నిమిషాలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది స్టేషన్లు

Update: 2023-07-22 06:40 GMT

భూకంపాలను అంచనా వేయడం అసాధ్యం. భూకంపం ఎప్పుడు వస్తుందో తెలుసుకుంటే ఎన్నో ప్రాణాలను కాపాడిన వాళ్లము అవుతాము. ఈ పజిల్ ను సాల్వ్ చేయడానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. అయితే భారీ భూకంపాలను అంచనా వేయడానికి జీపీఎస్ సహాయపడుతుందని భావిస్తూ ఉన్నారు. భూకంపాలు వాటి సంబంధిత విషయాలను చాలా గంటల ముందు GPS ద్వారా కనుక్కోవచ్చని అంటున్నారు.

ఇద్దరు రీసెర్చర్లు దీనిపై కీలక పరిశోధన చేసి.. సక్సెస్ అయ్యామని అంటున్నారు. ఈ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించామని.. తమ పరిశోధనల ప్రకారం, కొన్ని గంటల ముందు GPS మెజర్మెంట్ల ద్వారా భారీ భూకంపాలను గుర్తించవచ్చని అంటున్నారు. ఫ్రాన్స్ లోని ఇన్‌స్టిట్యూట్ డి రెచెర్చే పోర్ లే డెవలప్‌మెంట్, యూనివర్శిటీ కోట్ డి'అజుర్‌ కు చెందిన సీస్మాలజిస్ట్ క్వెంటిన్ బ్లెటరీ Space.com కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భూకంపాలను వీలైనంత త్వరగా గుర్తించవచ్చని అన్నారు. బ్లెటరీ సహోద్యోగి జీన్-మాథ్యూ నోక్వెట్ కూడా ఇందులో భాగమయ్యారు. 7.0 మ్యాగ్నిట్యూడ్ అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంప ప్రాంతాలకు సమీపంలో ఉన్న GPS స్టేషన్‌లపై దృష్టి సారించారు.

జీన్-మాథ్యూ నోక్వెట్ రెనోలోని నెవాడా విశ్వవిద్యాలయంలో ఉంచిన డేటాసెట్‌ను పరిశీలించారు. ప్రతి ఐదు నిమిషాలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది స్టేషన్లు GPS స్థానాలను రికార్డ్ చేస్తాయి. ఈ పరిశీలనల్లో స్వల్ప కదలికలను గుర్తించడం వీలవుతుంది. ఇది జీపీఎస్ డేటాలో రికార్డు అవుతాయి. 7.0 మ్యాగ్నిట్యూడ్ లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించిన ప్రదేశాల చుట్టూ ఉన్న GPS స్టేషన్‌ల ద్వారా భూకంపాలను గుర్తించవచ్చు. భూకంపం రావడానికి 48 గంటల ముందు ఆ స్టేషన్‌ల రికార్డులను పరిశీలిస్తే సరిపోతుందని అంటున్నారు. భూకంపానికి ముందు రెండు గంటలలో భూమిలోపల కొన్ని కదలికలు వస్తాయని.. భూకంపం వచ్చే సమయం దగ్గరపడుతున్న కొద్దీ కదలికలు తీవ్రమవుతాయని.. వీటిని ముందుగానే పసిగట్టవచ్చని బ్లెటరీ, జీన్-మాథ్యూ తమ రీసర్చ్ పేపర్స్ లో తెలిపారు. సైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధన, భూకంపాల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే మాత్రం భూకంపాన్ని కనుక్కోడానికి జీపీఎస్ ఎంతో సహాయపడబోతోంది. 

Tags:    

Similar News