Indonesia Floods : ఇండోనేషియాలో భారీ వరదలు.. 21 మంది మృతి
ఇండోనేషియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ వర్షం ధాటికి 21 మంది మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇండోనేషియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ వర్షం ధాటికి 21 మంది మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అనేక మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. కుండపోత వర్షాలతో ఇండోనేషియాలోని సుమత్ర ద్వీపంలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అనేక రహదారులు దెబ్బతిన్నాయి. వంతెనలు ధ్వంసం కావడంతో రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారింది. ఈ భారీ వర్షాలకు ఏడుగురు గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.
నిరాశ్రయులుగా మారి...
ఇక అనేక ఇళ్లు నేలమట్టం కావడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు దాదాపు ఎనభై వేల మందికి పైగానే ఇళ్లను కోల్పోయి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారని తెలిసింది. సుమత్ర ద్వీపం పశ్చిమ భాగంలోని పెసిసిర్ పెలటన్ జిల్లాలో నది ఉప్పొంగడంతో అనేక బండరాళ్లు వచ్చి ఇళ్లలోకి చేరాయి. పునరావాస కార్యక్రమాలతో పాటు సిబ్బంది సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. మరికొద్ది రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న సూచనతో ప్రజలు భయపడి పోతున్నారు.
వందల సంఖ్యలో...
ఇళ్లలో చిక్కుకున్న ప్రజలను అనేక మందిని పడవల సాయంతో బయటకు సురక్షితంగా సిబ్బంది చేర్చగలిగారు. ఒక్కసారిగా వరదలు రావడంతో ప్రజలు పూర్తిగా తమ ఇంట్లో ఉన్న వస్తువులను కూడా తీసుకుని బయటకు రాలేకోయారు. భారీ వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడి వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. సుమత్ర ద్వీపంలోని తొమ్మిది జిల్లాల్లో ఈ వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు పొంచి ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు భయపడిపోతున్నారు.