గొయ్యిలో 440కి పైగా మృతదేహాలు.. ఎక్కడో చూడండి !
మృతుల్లో చాలామంది తుపాకి తూటాలకు బలవ్వగా.. మరికొందరు క్షిపణులు, వైమానిక దాడులకు మరణించి ఉంటారని..
ఓ అటవీప్రాంతంలో ఉన్న గొయ్యిలో 440కి పైగా మృతదేహాలు బయటపడ్డాయి. ఈ ఘటన ఉక్రెయిన్ లోని ఇజియం ప్రాంతంలో వెలుగుచూసింది. రష్యా చేసిన దాడికి ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్ లోని.. ఖర్కివ్ పట్టణాన్ని ఉక్రెయిన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా నగరాన్ని పరిశీలించిన అధికారులకు ఇజియం ప్రాంతంలో శవాల దిబ్బలు కనిపించాయి. అక్కడి శివారు అటవీ ప్రాంతంలో ఉన్న గొయ్యిలో 440కి పైగా మృతదేహాలు బయటపడ్డాయని.. ఉక్రెయిన్ సీనియర్ దర్యాప్తు అధికారి ఒకరు మీడియాకు ఈ విషయం వెల్లడించారు.
మృతుల్లో చాలామంది తుపాకి తూటాలకు బలవ్వగా.. మరికొందరు క్షిపణులు, వైమానిక దాడులకు మరణించి ఉంటారని ఆయన తెలిపారు. చంపే ముందు బాధితులను హింసించినట్లు శరీరాలపై గుర్తులున్నాయని అన్నారు. ఖర్కివ్ ను ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న అనంతరం.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆ నగరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జెలెన్ మాట్లాడుతూ.. రష్యా ఉక్రెయిన్లో మరణశాసనం రాసిందని ఆవేదన వ్యక్తంచేశారు. బుచా, మెరియుపోల్ తర్వాత.. ఖర్కివ్ లో దారుణ పరిస్థితులు కళ్లకు కట్టినట్లు కనిపించాయని, దీనంతటికీ రష్యానే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.