ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో భారత్‌కు మేలు.. ఎలాగంటే..

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మరింతగా ముదురుతోంది. రానున్న రోజుల్లో ఈ వార్ మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి..

Update: 2023-10-15 02:49 GMT

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మరింతగా ముదురుతోంది. రానున్న రోజుల్లో ఈ వార్ మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యుద్ధం తీవ్రమైతే ఇజ్రాయెల్‌లోని ప్రపంచ కంపెనీలు అక్కడ తమ వ్యాపారాన్ని ముగించే అవకాశాలు ఉన్నాయని ఓ ఆంగ్ల దిన పత్రిక వెల్లడించింది. అయితే యుద్ధం ముదిరితే కంపెనీలు ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఉన్న కంపెనీలు భారతదేశం, తూర్పు యూరప్‌లోని దేశాల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ప్రతిభ ఉన్న ప్రాంతాలకు ఈ వ్యాపారాలు మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్‌లో 500 గ్లోబల్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. భారతీయ కంపెనీలు విప్రో, టీసీఎస్‌ సంస్థలు కూడా ఇజ్రాయెల్‌లో వ్యాపారాన్ని కలిగి ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని ఈ కంపెనీలలో దాదాపు 100,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

ఇజ్రాయెల్‌లో హైటెక్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. ఈ ప్రాంతం యుద్ధం ద్వారా ప్రభావితమవుతుంది. గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించేందుకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమైంది. ఇదే జరిగితే పెద్ద యుద్ధమే మొదలవుతుంది. చిప్‌మేకర్ ఇంటెల్ ఇజ్రాయెల్‌ లో అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ. ఇజ్రాయెల్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, సిబ్బంది భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. కాగా, యుద్ధం మరింత తీవ్రతరం అయినట్లయితే అక్కడ కంపెనీలు భారత్‌కు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో భారత్‌కు మరింత మేలు జరిగే అవకాశం ఉంది. ఇక అక్కడ చిక్కుకున్న భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకువస్తోంది.

Tags:    

Similar News