టర్కీ విధ్వంసానికి మరో సజీవ సాక్ష్యంగా 2 నెలల చిన్నారి
నేలమట్టమైన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతున్నాయి.
టర్కీ (తుర్కియే) దేశంలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపం.. తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వారంరోజులుగా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేలమట్టమైన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతున్నాయి. ఈ ఘోరమైన ప్రకృత్తి విపత్తుకి కొన్ని ఘటనలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. భవనాల శిథిలాల కిందే ఓ గర్భిణీ బిడ్డకు జన్మనిచ్చి తనువు చాలించిన విషయం తెలిసిందే. నిన్న 10 రోజుల శిశువు మృత్యుంజయుడిగా బయటపడింది.
తాజాగా.. రెండు నెలల చిన్నారి భవనాల శిథిలాల కింద సజీవంగా బయటపడింది. హతెయ్ ప్రాంతంలో శనివారం శిథిలాల కిందున్న ఓ రెండు నెలల చిన్నారిని సహాయక సిబ్బంది కాపాడగలిగారు. భూకంపం సంభవించి 128 గంటల గడుస్తున్నా ఆ చిన్నారి శిథిలాల కింద సజీవంగా కనిపించడంతో అక్కడి ప్రజల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. సహాయక సిబ్బంది చిన్నారిని బయటకు తీసుకుని వస్తుండగా స్థానికులు పెద్ద ఎత్తున చప్పట్లు చరుస్తూ, ఈలలు వేస్తూ సంబర పడిపోయారు.
టర్కీ మీడియా కథనాల ప్రకారం.. ఇటీవలే సహాయక సిబ్బంది రెండు సంవత్సరాల ఓ బాలికను రక్షించగలిగారు. అంతేకాకుండా.. ఆరు నెలల గర్భవతిని, 70 ఏళ్ల వృద్ధురాలినీ కాపాడారు. టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం ప్రపంచంలోనే ఏడవ అతి భారీ విపత్తుగా రికార్డుల్లోకి ఎక్కింది. తాజాగా లెక్కల ప్రకారం.. భూకంపం కారణంగా టర్కీలో 24,657 మంది మరణించగా.. సిరియాలో 3500 మంది కన్నుమూశారు.