వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. పాల్గొన్న టీడీపీ ఎంపీ
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి..
మే 28న సీనియర్ ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని.. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తానా పూర్వాధ్యక్షుడు సతీష్ వేమన అధ్యక్షతన ఈ ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఏపీ టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. అంతకుముందు ఊరేగింపుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకువచ్చారు. మహిళలు పసుపుపచ్చ చీరలు ధరించి, ర్యాలీగా తరలివచ్చి హారతులు ఇచ్చారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసీ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని అన్నారు. ఏపీలో చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఉందని, ఏపీ అభివృద్ధి ఆయనతోనే సాధ్యమన్నారు. యుగపురుషుడిగా చెప్పుకునే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుండటం అందరికీ గర్వకారణమన్నారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని తెలిపారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేడు అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నాయని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని అందరి కోరిక అని.. కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆశిస్తున్నామన్నారు. కాగా.. ఎన్టీఆర్ భోజన ప్రియులు కావడంతో.. ఈ వేడుకలో 100 రకాల వంటకాలతో అతిథులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకకు పరిమితికి మించి ఎన్టీఆర్ అభిమానులు వేలాదిగా తరలిరావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఉదయం 10 గంటలకే అభిమానులు పోటెత్తారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో కొందరు నడకదారినే సభాప్రాంతానికి చేరుకున్నారు.