Kyrgyzstan : కిర్గిస్థాన్ హింసకు అసలు కారణమదేనా? టార్గెట్ ఎవరంటే?

కిర్గిస్థాన్ లో అల్లర్లు చెలరేగుతున్నాయి. రాజధాని అయిన బిషేక్ లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి

Update: 2024-05-18 13:02 GMT

కిర్గిస్థాన్ లో అల్లర్లు చెలరేగుతున్నాయి. కిర్గిస్థాన్ రాజధాని అయిన బిషేక్ లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొందరు దాడులకు పాల్పడ్డారు. దీంతో భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎవరూ తమ గదులను విడిచి బయటకు రావద్దంటూ సూచించింది. బయట పరిస్థితులు సద్దుమణిగేంత వరకూ గదిలోనే ఉండేలా ప్లాన్ చేసుకోవాలని భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.

పరిస్థితులను తెలుసుకుంటూ...
పరిస్థితులను తెలుసుకుంటూ భారతీయ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు దేశ రాయబార కార్యాలయం తెలిపింది. విదేశీ మంత్రిత్వ శాఖ కూడా తాము వారితో టచ్ లోనే ఉన్నట్లు తెలిసింది. కిర్గిస్థాన్ నుంచి భారతీయ విద్యార్థులను రప్పించేందుకు కూడా వీలులేని పరిస్థితి ఉందని చెబుతన్నారు. విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ నెల 13వ తేదీ న జరిగిన ఒక ఘర్షణకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో అల్లరి మూకలు విదేశీ విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు.
ఎంబసీకి ఫోన్ చేయాలని...
దీంతో కిర్గిస్థాన్ లో ఉండే భారతీయ విద్యార్థులు ఏదైనా సాయం కావాలంటే ఎంబసీ 24/7 అందుబాటులో ఉంటుందని, సమస్య ఉంటే 0555710041 నెంబరుకు ఫోన్ చేయాలని చెప్పింది. ఎక్కువగా పాకిస్థాన్, భారత్, బంగ్లాదేశ్ విద్యార్థులుండే హాస్టళ్లనే అల్లరి మూకలు టార్గెట్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే ముగ్గురు పాకిస్థాన్ కు చెందిన విద్యార్థులు మృతి చెందినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని భారత్ కు రప్పించే ప్రయత్నం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


Tags:    

Similar News