రెండు దేశాల్లో వరుస భూకంపాలు
ఫైజాబాద్ కు 315 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. ఆ తర్వాత గంటన్నరకు తజకిస్థాన్ లోనూ..
ఇటీవల కాలంలో పలు దేశాల్లో వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. టర్కీ, సిరియా దేశాల్లో భూకంపాలు సంభవించి.. 42 వేల మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తలచుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతోంది. రెండ్రోజులకోసారి ప్రపంచంలో ఏదొక చోట భూ ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో రెండు దేశాల్లో గంటన్నర వ్యవధిలో వరుస భూకంపాలు చోటుచేసుకున్నాయి.
మంగళవారం తెల్లవారుజామున 4.05 గంటల సమయంలో ఆప్ఘనిస్తాన్ లో భూమి కంపించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. ఇది భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లు తెలిపింది. ఫైజాబాద్ కు 315 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. ఆ తర్వాత గంటన్నరకు తజకిస్థాన్ లోనూ భూ కంపం సంభవించింది. ఈ తెల్లవారుజామున 5.31 గంటలకు తజికిస్థాన్ లో భూప్రకంపనలు రాగా.. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతగా నమోదైంది. భూకంపాల సమయంలో ప్రజలు నిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి వస్తువులు కదులుతున్నట్టు అనిపించడంతో.. పిల్లలతో సహా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. గడిచిన ఐదు రోజుల్లో తజకిస్థాన్ లో ఇది మూడవ భూకంపమని అధికారులు పేర్కొన్నారు.