ప్రముఖ గాయకుడి కుమార్తె, మైఖేల్ జాక్సన్ మాజీ భార్య మృతి
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె తల్లి ప్రిసిల్లా ప్రెస్లీ ఒక ప్రకటన ద్వారా..
ప్రపంచ ప్రఖ్యాత గాయకుడైన రాక్ ఎన్ రోల్ పాట పాడిన ఎల్విస్ ప్రెస్లీ ఏకైక కుమార్తె లీసా మేరీ ప్రెస్లీ (54) మరణించారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె తల్లి ప్రిసిల్లా ప్రెస్లీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. తన ప్రియమైన కుమార్తె అందరినీ వదిలి వెళ్లిందనే విషయాన్ని ఎంతో భారమైన హృదయంతో ప్రకటిస్తున్నానన్నారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ రాష్ట్రం శివారు ప్రాంతమైన కాలాబాసాస్ లో ఉన్న తన నివాసంలో ఆమె నిన్న కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు.
వెంటనే లీసాను ఆస్పత్రికి తరలించారు కానీ.. ప్రయోజనం లేకపోయింది. 1968లో పుట్టిన లీసా.. తండ్రి అడుగుజాడల్లోనే నడిచి.. మ్యూజిక్ నే కెరీర్ గా ఎంచుకున్నారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న లీసా.. ప్రముఖ సింగర్ మైఖేల్ జాక్సన్ ను కూడా పెళ్లాడారు. హాలీవుడ్ స్టార్ నికొలస్ కేజ్, మ్యూజీషియన్ డానీ కీనో, మైఖేల్ లాక్ వుడ్ లను కూడా ఆమె వివాహమాడి.. ముగ్గురు పిల్లలకు తల్లయ్యారు. లీసా మొత్తం మూడు ఆల్బమ్స్ ను రిలీజ్ చేశారు. మంగళవారం రాత్రి జరిగిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు.