అమెరికాలో మానవ అక్రమ రవాణా.. మొత్తం చేసింది తెలుగు వాళ్లే!!

అమెరికాలోని టెక్సాస్‌లోని ప్రిన్స్‌టన్‌లో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు భారతీయ సంతతి వ్యక్తులను

Update: 2024-07-09 13:18 GMT

అమెరికాలోని టెక్సాస్‌లోని ప్రిన్స్‌టన్‌లో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు భారతీయ సంతతి వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రిన్స్‌టన్‌లోని కోలిన్ కౌంటీలో బలవంతంగా పనులు చేయిస్తున్నారనే ఆరోపణలపై ప్రిన్స్‌టన్ పోలీసులు చందన్ దాసిరెడ్డి (24), సంతోష్ కట్కూరి (31), ద్వారక గుండా (31), అనిల్ మాలే (37)లను అరెస్టు చేసినట్లు ఫాక్స్ 4 న్యూస్ నివేదించింది. ఒకే ఇంటిలో 15 మంది మహిళలు నేలపై నిద్రిస్తున్నట్లు ప్రిన్స్‌టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ గుర్తించిన తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. ఈ అరెస్ట్ అయిన నలుగురూ తెలుగు వాళ్ళే.

మానవ అక్రమ రవాణాతో పాటు పలువర్ని నిర్బంధించి తమ కంపెనీల్లో వెట్టిచాకిరి చేయిస్తున్నందుకు అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగా నిర్బంధించి వారితో బలవంతంగా పనిచేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టెక్సాస్‌ రాష్ట్రం గిన్స్‌బర్గ్‌ లేన్‌లోని 1000వ బ్లాక్‌లో ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రిన్స్‌టన్‌ పోలీసులకు సమాచారం వచ్చింది. మార్చి 13న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సంతోశ్‌ కట్కూరి నివాసంలో ప్రిన్స్‌టన్‌ పోలీసులు, సీఐడీ విభాగం సోదాలు నిర్వహించారు. 15 మంది యువతులను ఆ ఇంట్లో గుర్తించారు. వారితో కట్కూరి, ఇతర షెల్‌ కంపెనీల్లో సంతోశ్‌ భార్య ద్వారక గుండా బలవంతంగా పనిచేయిస్తున్నట్లు నిర్ధారించారు. వారి నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ప్రిన్స్‌టన్‌తో పాటు మెలీసా, మెక్‌కిన్నీ ప్రాంతాల్లోనూ బలవంతంగా వెట్టిచాకిరి చేయిస్తున్నట్లు తేలింది. విచారణలో నిందితులు అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. పురుషులు, మహిళలు ఇద్దరూ కూడా బాధితుల్లో ఉన్నారని.. షెల్ కంపెనీలకు ప్రోగ్రామర్లుగా పనిచేశారని ప్రిన్స్‌టన్ పోలీసులు చెప్పారు.


Tags:    

Similar News