చికున్ గున్యాకు వ్యాక్సిన్ వచ్చేసింది

ఇప్పుడు చికున్ గున్యాకు వ్యాక్సిన్ వచ్చేసింది. చికున్‌గున్యాకు ప్రపంచంలోనే

Update: 2023-11-11 02:54 GMT

ఒకప్పుడు భారతదేశాన్ని.. తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేసిన వ్యాధి చికున్ గున్యా. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి గురించి అక్కడక్కడా మనం వింటూ ఉంటాం. ఇక ఇన్నాళ్లూ వ్యాక్సిన్ లేకపోవడంతో సింప్టమ్స్ ను నయం చేయడానికి వైద్యులు ప్రయత్నించే వారు. అయితే ఇప్పుడు చికున్ గున్యాకు వ్యాక్సిన్ వచ్చేసింది. చికున్‌గున్యాకు ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌ను US ఆరోగ్య అధికారులు ఆమోదించారు. Ixchiq పేరుతో విక్రయించే ఈ వ్యాక్సిన్ 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తుల కోసం ఆమోదించినట్లు US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

ఇక్స్‌చిక్‌ వ్యాక్సిన్‌ను ఇప్పటికే 266 మంది రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించగా మంచి ఫలితాలొచ్చాయని అధికారులు తెలిపారు. ఉత్తర అమెరికాలో 3,500 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా మంచి ప్రభావం చూపించింది. 1.6 శాతం మందిలో మాత్రం తీవ్రమైన తలనొప్పి తదితర గున్యా తాలూకు లక్షణాలు కనిపించాయి. ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చిందని ఎఫ్‌డీఏ సెంటర్‌ ఫర్‌ బయోలాజిక్స్‌ ఎవాల్యుయేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ పీటర్‌ మార్క్స్‌ చెప్పారు. బయోటెక్‌ కంపెనీ ‘వాల్వెవా ఆ్రస్టియా’ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులను కలిగించే చికున్‌గున్యా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, అమెరికాలోని పలు ప్రాంతాలలో ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇటీవల చికున్‌గున్యా వైరస్ కొత్త భౌగోళిక ప్రాంతాలకు కూడా వ్యాపించింది, దీనివల్ల ప్రపంచవ్యాప్త వ్యాధి వ్యాప్తి పెరుగుతుందని FDA తెలిపింది. గత 15 సంవత్సరాలలో 5 మిలియన్లకు పైగా చికున్‌గున్యా కేసులను నివేదించారు. చికున్‌గున్యా వైరస్‌ కారణంగా తీవ్రమైన, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. టీకా ఒక మోతాదులో ఇంజెక్ట్ చేస్తారు. ఇతర వ్యాక్సిన్‌ల మాదిరిగానే చికున్‌గున్యా వైరస్ ప్రత్యక్ష, బలహీనమైన వెర్షన్‌ వ్యాక్సిన్ లో ఉంటుంది.


Tags:    

Similar News