ఉధృతమైన యుద్ధం.. వందల సంఖ్యలో మృతదేహాలు
ఇజ్రాయిల్ , హమాస్ యుద్ధం మరింత ఉధృతమైంది. తాజాగా గాజా లోని ఆసుపత్రిపై ఇజ్రాయిల్ దాడులకు దిగింది
ఇజ్రాయిల్ , హమాస్ యుద్ధం మరింత ఉధృతమైంది. తాజాగా గాజా లోని ఆసుపత్రిపై ఇజ్రాయిల్ దాడులకు దిగింది. ఈ దాడుల కారణంగా ఐదు వందల మంది మరణించినట్లు తెలిసింది. గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆసుపత్రిపై ఇజ్రాయిల్ సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. రోగులు కొందరు ప్రాణభయంతో బయటకు పరుగులు తీసినట్లు చెబుతున్నారు. మరికొందరు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనా దీనిపై స్పందించింది. ఆసుపత్రిపై దాడి ఘటన దారుణమని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ అన్నారు. మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించినట్లు తెలిపారు.
భారీ రాకెట్లతో...
ఇజ్రాయిల్ సైన్యం భారీగా రాకెట్లను ప్రయోగించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఉత్తర గాజాను ఖాళీ చేయాల్సిందిగా ఇప్పిటకే పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ ఆదేశించింది. అలాగే దక్షిణ గాజాలోని రఫా, ఖాన్ యూనిస్ నగరాల్లో జరిగిన దాడుల కారణంగా పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయిల్ సైన్యం ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఒక్కసారి దాడులకు దిగడంతో ఎక్కువ మంది పాలస్తానీయులు మరణించినట్లు చెబుతున్నారు. అయితే హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ సైన్యం ఈ దాడులకు దిగుతుంది. వారికి మంచినీరు వంటి మౌలిక సౌకర్యాలు అందకుండా చేసి తరిమికొట్టాలన్న ప్రయత్నం చేస్తుంది.
పదకొండు రోజులు...
ఇప్పటికే ఇజ్రాయిల్ - హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై 11 రోజులు కావస్తుంది. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయిల్ కు చెందిన వారు హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు. వారిని వదిలేయమని ఇజ్రాయిల్ కోరుతుంది. కూలిపోయిన భవనాల కింద ఇంకా అనేక మంది ఉంటారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఎంత మంది ఉన్నారన్నది లెక్కలోకి రావడం లేదు. ఇప్పటి వరకూ అయితే ఇజ్రాయిల్ లో 1400 మంది వరకూ మరణించారని, గాజాలో దాదాపు మూడు వేల మంది అశువులు బాశారని చెబుతున్నారు. ఇంతకు మించి ఉండవచ్చని అనధికారికంగా తెలుస్తోంది. నేడు అమెరికా అధ్యక్షుడు బైడన్ ఇజ్రాయిల్‌లో పర్యటించనున్నారు. రెండు వేల మంది సైన్యాన్ని సిద్ధం చేశారు.