వరదలు, అంటువ్యాధులతో పాక్ విలవిల.. ఒక్కరోజే 90వేల డయేరియా కేసులు
పాకిస్థాన్ లో చాలా ప్రాంతాలు ఇంకా వరదల్లోనే నానుతున్నాయి. ఇప్పటివరకూ అక్కడ 1191 మంది ప్రాణాలు కోల్పోగా..
పాకిస్థాన్ ను వరదలు భయపెడుతున్నాయి. ఓవైపు వరదలు.. మరోవైపు అంటువ్యాధులతో పాక్ విలవిలలాడుతోంది. ఆ దేశంలో సగభాగం వరద గుప్పిట్లో ఉండిపోగా.. కలుషితమైన త్రాగునీరు కారణంగా అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న లక్షలాది మంది నిరాశ్రయులకు పునరావాసాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. అంటువ్యాధులు సవాలుగా మారాయి. ఒక్కరోజే సింధ్ ప్రావిన్స్ లో 90 వేల డయేరియా కేసులు బయటపడటం ఆందోళనకు గురిచేస్తోంది. వరదల కారణంగా వస్తున్న అంటువ్యాధులపై డబ్ల్యూహెచ్ఓ సైతం ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పటి వరకూ వరదల్లో చిక్కుకున్న 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. వాటిలో సింధ్ ప్రావిన్సులో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాల్లో అంటువ్యాధులు బయటపడ్డాయి. డయేరియా, చర్మవ్యాధులతో పాటు ఇన్ ఫెక్షన్లు కూడా అధికంగా ఉన్నట్లు సింధ్ ప్రావిన్స్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కలరా, ఇతర అంటువ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్యశిబిరాలు, మొబైల్ వైద్య సేవలు అందిస్తున్నామని సింధ్ ప్రావిన్స్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ అజ్రా ఫజల్ పేర్కొన్నారు.
పాకిస్థాన్ లో చాలా ప్రాంతాలు ఇంకా వరదల్లోనే నానుతున్నాయి. ఇప్పటివరకూ అక్కడ 1191 మంది ప్రాణాలు కోల్పోగా.. 3.3 కోట్ల మందిపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. సుమారు 10 లక్షల ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారుల అంచనా. వరదల్లో చిక్కుకుని నిరాశ్రయులైన వారిలో 6,50,000 మంది గర్భిణీ స్త్రీలు ఉండగా.. వారిలో 73వేల మంది వచ్చే నెలరోజుల్లో ప్రసవించనున్నట్లు ఐరాస తెలపింది. ఈ నేపథ్యంలో గర్భిణీ స్త్రీలకు అందుబాటులో వైద్యసదుపాయాలను ఏర్పాటు చేసేలా పాక్ దృష్టిసారించాలని ఐరాస సూచించింది.