సూపర్‌స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సుభాస్కరన్ నిర్మించిన విజువల్ వండర్ చిత్రం '2.ఓ'. ఈ చిత్రం నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ ఓపెనింగ్స్ తో బ్లాక్‌బస్టర్ హిట్‌గా టాక్ తెచ్చుకుంది. మొదటి నాలుగు రోజులకే 400 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాని ఇప్పుడు చైనాలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ చైనాలోని హెచ్‌వై మీడియాతో అసోసియేట్ అయి '2.ఓ' చిత్రాన్ని చైనా భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తోంది.
పది వేల థియేటర్లలో...
హెచ్‌వై మీడియా ప్రముఖ నిర్మాణ సంస్థలు సోని, ట్వంటియత్ సెంచరీ ఫాక్స్, వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్, డిస్నీ సంస్థలతో అసోసియేట్ అయి ఎన్నో సినిమాలు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్‌స్టార్ రజినీకాంత్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ని దృష్టిలో ఉంచుకొని చాలా గ్రాండ్‌గా '2.ఓ' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. చైనాలో 10,000 థియేటర్స్ లో 56,000 స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదల కానుంది. అందులో 47,000 స్క్రీన్స్ లో 3డీ వెర్షన్‌ను ప్రదర్శించనున్నారు. 2019 మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.