వీధిలో కుప్పకూలిన వ్యక్తికి.. CPR చేసి ప్రాణం పోసిన నటుడు..
వీధిలో నడుస్తూ నడుస్తూనే అకస్మాత్తుగా కుప్పకూలిపయిన ఒక వ్యక్తికి.. ప్రముఖ నటుడు CPR చేసి ప్రాణం పోశాడు.;
ఈమధ్య కాలంలో గుండె సంబంధిత సమస్యలతో జరుగుతున్న మరణాలు ఎక్కువ అయ్యిపోయాయి. చిన్నా పెద్దా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్యలను ఎదుర్కొని అకస్మాత్తుగా ప్రాణాలు వదులుతున్నారు. జిమ్‌లో వర్క్ ఔట్స్ చేస్తూ, సరదాగా డాన్స్‌లు చేస్తూ, లేదా రోడ్డుపై నడుస్తూ నడుస్తూనే అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. అలా జరిగిన సమయంలో కొందరికి సరైన చికిత్స అంది బ్రతుకుంతుంటే.. కొందరు మాత్రం సరైన టైంలో చికిత్స అందకపోవడంతో మరణిస్తున్నారు.
గతంలో రెండు మూడుసార్లు వార్తల్లో వినేవుంటారు.. నడిరోడ్డుపై కుప్పకూలిపోయిన వ్యక్తికి అక్కడే ఉన్న ఒక వ్యక్తి CPR (కార్డియో పల్మోనరీ రిససిటేషన్) చేసి ప్రాణాలు నిలబెట్టారని. ఇప్పుడు కూడా అలాంటి ఒక సంఘటనే చోటు చేసుకుంది. బాలీవుడ్ టెలివిజన్ అండ్ సినిమా రంగంలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న 'గుర్మీత్ చౌదర్'.. ముంబయి వీధిలో కుప్పకూలిన ఒక వ్యక్తి సకాలంలో CPR అందించి ప్రాణాలు నిలబెట్టాడు.
ఇక అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అంబులెన్స్ ని పిలిపించగా.. గుర్మీత్ దగ్గర ఉండి ఆ వ్యక్తిని అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్ కి పంపించాడు. ఇక అక్కడ ఉన్న వారంతా గుర్మీత్ కి చప్పట్లు కొట్టి ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజెన్స్ కూడా గుర్మీత్‌ని.. రియల్ హీరో అని, మానవత్వం ఉన్న నటుడని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం దేశంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువుగా జరుగుతుండడంతో పోలీస్ అధికారులు, వైద్యులు.. CPR పై ప్రజల్లో అవగాహన కలిగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.