తమకు స్వేచ్ఛ కావాలంటూ ఇరాన్ లో మహిళలు చేపడుతున్న నిరసనకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇరాన్ లో మహిళలపై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఎంతో మంది ప్రముఖులు తమ మద్దతును తెలుపుతూ ఉన్నారు. ఏదో ఒక విధంగా ఇరాన్ ప్రభుత్వానికి తమ సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి నేను ఒక మహిళను.. నాకు నచ్చినట్లు నేను ఉంటాను అనే విధంగా బట్టలన్నీ విప్పేసి తన నిరసనను తెలియజేసింది. ఆమె తీసుకున్న ఈ డేరింగ్ నిర్ణయానికి ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ సిరీస్ సేక్రేడ్ గేమ్స్ ద్వారా పాపులర్ అయిన ఇరాన్ కు చెందిన నటి ఎల్నాజ్ నోరౌజీ.. ఇరాన్ లో మోరల్ పోలీసింగ్ కి వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్న నిరసన కార్యక్రమానికి తన వంతుగా గళం వినిపించింది. మహిళలు తమకు కావలసినది ధరించే హక్కు ఉందని ఆమె తెలిపింది. ఎల్నాజ్ నోరౌజీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె మహిళలు తమకు నచ్చినది ధరించాలని అనుకుంటారని.. ఆమెను ఎవరూ ఆపలేరు అనే విషయాన్ని తెలియజేయడానికి తన బట్టలు విప్పి నిరసనలో చేరారు.
"ప్రతి స్త్రీ, ప్రపంచంలో ఎక్కడైనా, ఆమె ఎక్కడి నుండి వచ్చినప్పటికీ, ఆమె కోరుకున్నది ధరించే హక్కును కలిగి ఉండాలి. నచ్చిన దుస్తులు ధరించండి" అని ఎల్నాజ్ నోరౌజీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకుని వచ్చింది. "ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు, నమ్మకాలు ఉన్నాయి. వారిని గౌరవించాలి. ప్రజాస్వామ్యం అంటే నిర్ణయించే అధికారం... ప్రతి స్త్రీకి తన శరీరంపై నిర్ణయం తీసుకునే అధికారం ఉండాలి. నేను నగ్నత్వాన్ని ప్రోత్సహించడం లేదు, నేను స్వేచ్ఛను ప్రోత్సహిస్తున్నాను." ఆమె రాసింది. ఎల్నాజ్ నోరౌజీ హిజాబ్ ను తీసివేయడం మొదలుపెట్టి.. చివరికి అర్ధనగ్నంగా నిలబడింది.
ఎల్నాజ్ నోరౌజీ యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించడానికి ముందు డియోర్, లాకోస్ట్, లే కాక్ స్పోర్టివ్ వంటి బ్రాండ్‌లకు అంతర్జాతీయ మోడల్‌గా 10 సంవత్సరాలకు పైగా పని చేసింది. ఆమె పర్షియన్ సంప్రదాయ నృత్యంలో శిక్షణ పొందింది. భారతదేశంలో.. ఆమె కథక్ నేర్చుకుంటూ ఉంది.