Sonu Sood: పవన్ కళ్యాణ్ స్టైల్లో సోనూసూద్‌కి షాక్ ఇచ్చిన ఫ్యాన్..
పవన్ కళ్యాణ్ స్టైల్లో సోనూసూద్‌కి షాక్ ఇచ్చిన ఫ్యాన్. ఇక ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్ సోషల్ మీడియాలో షేర్ చేసి..;
Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాల్లో విలన్ గా ఇక్కడి ఆడియన్స్ కి పరిచయమైన సోనూసూద్.. తన నటనతో ఆడియన్స్ నుంచి అభినందనలు అందుకున్నారు. కానీ కోవిడ్ సమయంలో ఆయన చేసిన సహాయాలతో.. ప్రతి ఒక్కరి మనసుని గెలుచుకున్నారు. సినిమాల్లో తన నటనతో ఎంతటి స్టార్ డమ్ ని సంపాదించుకున్నారో.. తన సేవ గుణంతో అంతకుమించి అభిమానాన్ని సంపాదించుకున్నారు.
ఈ అభిమానంతోనే ఒక ఫ్యాన్.. సోనూసూద్ కి షాక్ ఇచ్చాడు. అది కూడా పవన్ కళ్యాణ్ స్టైల్ లో ఇచ్చాడు. ఇక ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్ సోషల్ మీడియాలో షేర్ చేసి అందరితో పంచుకున్నారు. ఇంతకీ ఆ అభిమాని చేసిన పని ఏంటంటే.. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఇక ఆ మూవీలోని 'ఆరడుగుల బుల్లెట్టు' సాంగ్ ఎంతటి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆ సాంగ్ లోని ఓ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ ఓ రెస్టారెంట్ లో ఫుడ్ తింటున్న సమయంలో.. తన ఎదురుగా ఒక ఫ్యామిలీ కూర్చొని ఉంటుంది. వారి ఫ్యామిలీ అటాచ్మెంట్ ని గమనించిన పవన్ కళ్యాణ్.. వారి రెస్టారెంట్ బిల్ మొత్తాన్ని తనే కట్టేస్తాడు. ఇదే సీన్ సోనూసూద్ విషయంలో కూడా జరిగింది. సోనూసూద్ రెస్టారెంట్ లో ఫుడ్ తింటున్న సమయంలో, అతన్ని గమనించిన ఒక అభిమాని.. సోనూసూద్ చేసే పనులను అభినందిస్తూ ఆయనికి తెలియకుండా మొత్తం బిల్ ని కట్టేసి వెళ్ళిపోయాడు.
అయితే వెళ్ళిపోతూ సోనూసూద్ కోసం ఒక చిట్టి ఇచ్చి వెళ్ళాడు. "దేశం కోసం మీరు చేస్తున్న మంచి పనులకు కృతజ్ఞతలు" అంటూ సోనూసూద్ కి ఒక చిట్టి అందేలా చేసి వెళ్ళిపోయాడు. ఇక ఆ చిట్టిని సోనూసూద్ షేర్ చేస్తూ.. అతడికి థాంక్యూ తెలియజేసారు.