ఓటీటీలో దూసుకెళ్తున్న పూజా కన్నన్.. సాయి పల్లవి ఫుల్ హ్యాపీ
హీరోయిన్ సాయిపల్లవి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. ఇప్పుడు ఆమె సోదరి కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.;
హీరోయిన్ సాయిపల్లవి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. ఇప్పటి వరకూ తన నటనతో మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది ఆమె. ఇప్పుడు ఆమె సోదరి కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. జీ తమిళ్, అమిర్తా, థింక్ బిగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'చిత్తిరై సేవానమ్' సినిమాలో సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు శిల్వ దర్శకత్వం వహించారు. కాగా.. పూజా కన్నన్ నటించిన ఈ సినిమా డిసెంబర్ 3న జీ 5 ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.
తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని....
'చిత్తిరై సేవానమ్' చిత్రంలో తండ్రి - కూతురు అనుబంధాన్ని ఎంత అందంగా చూపించారో.. సోషల్ మీడియా వల్ల వారిద్దరు ఎదుర్కొన్న సమస్యలను కూడా అంతే అర్థవంతంగా చూపించారు దర్శకుడు శిల్వ. పూజా కన్నన్ వెండితెర అరంగేట్రం సందర్భంగా సాయిపల్లవి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.
ఆన్ స్క్రీన్ లోనూ....
" పూజా.. నీ గురించి నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రపంచమంతా తెలుసుకోనుంది. ఆరోగ్యం బాగోలేదని అమ్మనాన్నకు చెప్పి బంక్ కొట్టడం, నిరాశగా ఉన్నప్పటికీ ఉత్సాహంగా ముందుకు వెళ్లడం, ఇలా ఆఫ్ స్క్రీన్ లోనే కాదు.. ఇప్పుడు ఆన్ స్క్రీన్‌లోనూ నటిగా ఎదిగావు. ఈరోజు నీ ఫస్ట్ సినిమా విడుదల అవుతోంది. ఐ లవ్ యూ. నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. జీవితంలో నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. నిన్ను చూసి నేను ఎప్పుడూ గర్వపడతాను." అని సాయిపల్లవి తనకు సోదరిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసింది.