అన్ స్టాపబుల్ షో పై ఎవరు స్పందించాలో.. వారే స్పందించారు

Update: 2022-10-15 01:23 GMT

నందమూరి బాలకృష్ణకు ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకుని వచ్చిన షో 'అన్ స్టాపబుల్'. ఆయన లోని మరో కోణం తెలుగు ప్రేక్షకులకు తెలిసి వచ్చింది. ఇప్పుడు రెండో సీజన్ మొదలైంది. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, ఆయన కుమారుడు నారా లోకేష్ ను పిలిపించారు. ఈ ఎపిసోడ్ కాస్త ఫన్నీ గానూ, కాస్త ఎమోషనల్ గానూ సాగింది. పలు విషయాలను చంద్రబాబు నాయుడు, బాలయ్య కలిసి మాట్లాడుకున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావుకు సంబంధించిన విషయాలను కూడా చర్చించారు. ఎన్టీఆర్ గారిని నేను అంతకుముందు పేపర్లలో .. సినిమాలలో మాత్రమే చూశాను. అంజయ్యగారి క్యాబినెట్ లో నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు రామకృష్ణ సినీ స్టూడియోలో ఆయనను మొదటిసారిగా కలిశాను. అప్పుడు 'అనురాగదేవత' షూటింగు జరుగుతోంది. షూటింగు బ్రేక్ లో ఆయన నాతో మాట్లాడారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక టీడీపీలో సంక్షోభం సమయంలో తాను కాళ్లు పట్టుకుని అడిగానని.. టీడీపీని రక్షించుకోవడం కోసం తాను ఆరోజు ముందుకు అడుగు వేశానని చెప్పారు. బయట వ్యక్తుల కారణంగా ఎన్టీఆర్ పై ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు.

తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి స్పందించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు, బాలకృష్ణ ఈ షోను ఎంచుకున్నారని.. చంద్రబాబు నాడు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాడన్నది ఒట్టి అబద్ధమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలని.. వాళ్లు చేసిన కామెంట్స్‌లో ఎలాంటి నిజం లేదని అన్నారు. నాడు పార్టీలో గొడవలు చేయించింది, ఎమ్మెల్యేలను రెచ్చగొట్టింది, ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రోడ్ల పైకి పిలిచింది చంద్రబాబేనని అన్నారు. అన్ స్టాపబుల్-2 తాజా ఎపిసోడ్ చూశాక బాలకృష్ణ అంటేనే రోత పుడుతోందని, అతడు ఎన్టీఆర్ కొడుకేనా అని అసహ్యం కలుగుతోందని లక్ష్మీపార్వతి అన్నారు. ఆ షో చూస్తుంటే, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినవాళ్లు ఒకరినొకరు సమర్థించుకున్నట్టుగా ఉందని విమర్శించారు. చంద్రబాబు అధికార దాహమే ఎన్టీఆర్‌ను చంపేసిందని లక్ష్మీ పార్వతి విమర్శించింది. తానే అధికారం తీసుకోవాలనే లక్ష్యంగా.. ఎన్నికలకు ముందే బాబు కుట్ర చేశారని ఆమె చెప్పారు. నిజంగా పార్టీలో తాను ఇబ్బంది పెట్టి ఉంటే.. ఎన్టీఆర్ ఎందుకు భరిస్తారని ఆమె ప్రశ్నించారు. నల్గొండ,రంగారెడ్డి జిల్లాల్లో ఎన్టీఆర్ తనకు ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చారన్న అక్కసుతో.. చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి.. రోడ్డు మీదకు తీసుకొచ్చారన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ క్రమశిక్షణా చర్యలు కింద ముగ్గురూ లేదా నలుగురి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. 20 మందిని సస్పెండ్ చేశారన్నది అబద్దం అని లక్ష్మీపార్వతి చెప్పారు. చంద్రబాబు ఓ దుర్మార్గుడు.. ఇప్పటికీ నిజం చెప్పాలన్న మానవత్వం లేదని లక్ష్మీ పార్వతి అన్నారు. ఇప్పటిదాకా బాలకృష్ణను బాగా అభిమానించేదాన్ని, చాలా ఇష్టపడ్డాను. చాలా సాయం చేశానని ఆమె చెప్పారు. ఇప్పుడు ఇద్దరి మాటలను చూస్తుంటే కంపరంగా ఉందని తెలిపారు. బావను కాపాడటానికి బావమరిది రంగంలోకి దిగాడని విమర్శించారు.


Tags:    

Similar News