ఆదిపురుష్ సినిమాపై చేస్తున్న చెత్త రాజకీయాలను మా పార్టీ సహించదు

Update: 2022-10-08 11:17 GMT

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ఆదిపురుష్' సినిమాపై కొందరు వివాదం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే..! ఆ సినిమాను విడుదల చేయనివ్వమంటూ కొందరు విమర్శలు సృష్టిస్తూ వస్తున్నారు. రామాయణ పాత్రలను తప్పుగా చూపిస్తున్నారంటూ చిత్ర బృందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఆదిపురుష్ చిత్రానికి మద్దతు ప్రకటించింది.

ఎంఎన్ఎస్ పార్టీ నేత, సినీ నిర్మాత అమేయ ఖోప్కార్ దీనిపై స్పందించారు. "దర్శకుడు ఓం రౌత్ కు, ఆదిపురుష్ చిత్రానికి మేం మద్దతు ఇస్తున్నాం. ఈ సినిమా ఎలా విడుదలవుతుందో చూస్తామని మీరు అంటున్నారు... కానీ మహారాష్ట్రలో ఇలాంటి గూండాగిరీ చెల్లదు. ఆదిపురుష్ సినిమా తప్పకుండా రిలీజ్ అవుతుంది... అందుకు మేం మద్దతుగా నిలుస్తాం" అని అన్నారు. కేవలం టీజర్ చూసి ఈ సినిమాను ఆపేస్తామంటూ మీ చెత్త రాజకీయాలు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఆలోచించడం నేర్చుకోండి.. ఇలాంటి కుటిల రాజకీయాలను ఎంఎన్ఎస్ అంగీకరించదన్నారు. హిందూ అయినా, ముస్లిం అయినా... మేం అన్ని మతాలకు మద్దతు ఇస్తాం. మొదట ఈ సినిమా చూసి, ఆ తర్వాత ఏంచేయాలో నిర్ణయం తీసుకోండన్నారు. ఓం రౌత్ గొప్ప దర్శకుడు. గతంలో ఆయన తానాజీ, లోకమాన్య వంటి మంచి చిత్రాలను తెరకెక్కించారు. ఓం రౌత్ నిజమైన హిందుత్వవాది. అతని గురించి నాకు బాగా తెలుసని అమేయ ఖోప్కార్ వెల్లడించారు.
చిత్ర దర్శకుడు ఓం రౌత్ స్పందిస్తూ.. టీజర్ లో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేశామని.. చిన్ని వీడియోను చూసి ఒక అంచనాకు రావద్దని అన్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల అవుతుందని... సినిమా చూసిన వారెవరూ నిరాశ చెందరని చెప్పారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని అన్నారు. ప్రభాస్ కోసమే రాముడి పాత్రను రాశానని... కథ రాస్తున్నంత సేపు తన మైండ్ లో ప్రభాసే ఉన్నాడని చెప్పారు.


Tags:    

Similar News