చిలికి చిలికి గాలివానలా మారుతోన్న గరికపాటి వివాదం
చిరంజీవి గరికపాటి పై తనకున్న అభిమానం, గౌరవం గురించి మాట్లాడటంతోనే అది అక్కడితో సమసిపోయింది. కానీ ఇప్పుడు..
నిన్న తెలంగాణలోని జలవిహార్ లో మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కల్యాణ్, మంచు విష్ణు వంటి టాలీవుడ్ నటులతో పాటు.. రాజకీయ ప్రముఖులు, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గరికపాటి ప్రవచనాలు చెప్తుండగా.. చిరంజీవి వచ్చారు. దాంతో అక్కడున్న వారంతా ఆయనతో ఫొటోలు దిగడం మొదలుపెట్టారు. దాంతో గరికపాటి.. చిరంజీవి గారు మీ ఫొటో సెషన్ ఆపితే.. నేను ప్రవచనాలు చెప్తా.. అని విజ్ఞప్తి చేయడంతో చిరంజీవి వెంటనే వెళ్లి గరికపాటి పక్కనే కూర్చున్నారు.
అయితే అక్కడ చిరంజీవి మీద మాత్రం తన కోపాన్ని గాన్నీ ద్వేషాన్ని గాన్నీ ప్రదర్శించలేదు గరికపాటి. ఆ సెల్ఫీల సెషన్ ఆపి ఇక్కడ కూర్చోండని విజ్ఞప్తి చేశారంతే. ఆ తరువాత చిరంజీవి మాట్లాడుతూ.. ఎంతో హుందాగా ప్రవర్తించారు. గరికపాటి అంటే తనకు అభిమానమని, తన ప్రవచనాలు ఎంతో స్పూర్తినిచ్చేలా ఉంటాయని ఇలా ఎంతో గొప్పగా చెప్పి ప్రశంసించాడు. తాజాగా ఈ వివాదంలోకి నాగబాబు ఎంటరయ్యారు. గరికపాటిపై ఆయన పరోక్షంగా సెటైర్లు వేయడంతో విషయం కాస్తా యూటర్న్ తీసుకున్నట్లైంది.
చిరంజీవి గరికపాటి పై తనకున్న అభిమానం, గౌరవం గురించి మాట్లాడటంతోనే అది అక్కడితో సమసిపోయింది. కానీ ఇప్పుడు సోదరుడు నాగబాబు, కొంత మంది మెగా ఫ్యాన్స్ మాత్రం గరికపాటి మీద కౌంటర్లు వేస్తూ వివాదాన్ని ఇంకా సాగదీస్తున్నారు. గరికపాటి మాటలను హైలెట్ చేస్తున్నారు. బ్రహ్మాజీ సైతం చిరంజీవి గొప్పదనాన్ని కొనియాడుతూ.. అన్నయ్యని చూసి నేర్చుకోవలసింది చాలా ఉందంటూ ట్వీట్ చేశాడు.