యువకుడిపై నయన్ ఫైర్.. ఫోన్ పగలగొడతానంటూ ఆగ్రహం
వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానని హెచ్చరించింది నయన్. వివరాల్లోకి వెళ్తే.. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని..
సినీ తారలు పబ్లిక్ ప్లేస్ లలో కనిపిస్తే చాలు.. వారితో సెల్ఫీలు దిగేందుకు, వాళ్లను వీడియోలు తీసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తారు. అలా సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార హనుమాన్ జయంతి సందర్భంగా ఓ ఆలయానికి వెళ్లగా.. ఓ అభిమాని వీడియో తీస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానని హెచ్చరించింది నయన్. వివరాల్లోకి వెళ్తే.. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి గురువారం తంజావూరులోని తమ కులదైవం ఆలయాన్ని నయన్ సందర్శించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నయనతార దంపతులు స్థానిక ఆలయానికి వచ్చారని తెలిసిన చుట్టుపక్కల వారంతా పెద్ద సంఖ్యలో ఆ ఆలయం వద్దకు చేరుకున్నారు.
అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో.. వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. తమకోసం అభిమానులు పెద్దసంఖ్యలో రావడంతో.. స్పందించిన విఘ్నేశ్ శివన్ వారికి అభివాదం చేసి తమను ప్రశాంతంగా పూజలు చేసుకోనివ్వాలని కోరారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో తోపులాట జరిగింది. దీంతో నయన్ పూజ అనంతరం బయటకు వచ్చేసి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా అక్కడ అభిమానులతో ఫొటోలు కూడా దిగారు. అక్కడి నుంచి రైలులో బయలుదేరగా.. నయనతార రైలెక్కిన వెంటనే ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు.
నయనతారతో అతను సెల్ఫీ వీడియో తీసుకునేందుకు ప్రయత్నించాడు. అప్పటికే గుడివద్ద అభిమానుల తోపులాటతో కోపంగా ఉన్న నయన్.. వీడియో తీయడం ఆపకుంటే ఫోన్ పగలగొట్టేస్తానని ఆ యువకుడిని హెచ్చరించింది. ఆ యువకుడు నయన్ తో సెల్ఫీ వీడియో తీసుకునేందుకు ప్రయత్నించిన వీడియో బయటికి రావడంతో.. ఈ విషయం వెలుగుచూసింది.