తమిళ చిత్ర పరిశ్రమలో ఇటీవల కొన్ని ఆంక్షలు విధించినట్లు వార్తలు వచ్చాయి. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ) కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. తమిళనాడులోనే చిత్రీకరణలు జరపాలని, అత్యవసరమైతేనే షూట్ కోసం బయట ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. కేవలం తమిళ నటీనటులను మాత్రమే సినిమాల్లోకి తీసుకోవాలంటూ నియమాలు ప్రవేశపెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఆంక్షలు విధించడాన్ని అదే ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులోని పరిసరాలు షూటింగ్స్‌కు అనుకూలంగా లేవని, మౌలిక సదుపాయల లేమి, అనుమతుల్లో జాప్యంతోనే రాష్ట్రంలో షూటింగ్ చేయలేకపోతున్నామని ఇప్పటికే చెప్పేసారు. తెలుగు రాష్ట్రాలతోపాటు, విదేశాల్లోనూ షూటింగ్స్‌కు వెళ్తామని నిర్మాతలు తేల్చి చెప్పేశారు.
తాజాగా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందించిన బ్రో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఆఖర్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తమిళ చిత్ర పరిశ్రమలో విధించిన ఆంక్షలపై తన మనసులోని మాట బయటపెట్టారు. తమిళ చిత్ర పరిశ్రమకు కూడా నాదొక విన్నపం.. పరిశ్రమలో మనవాళ్లే చేయాలి అనే ధోరణి నుంచి బయటకు రావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ అందరికి అన్నం పెడుతుంది.. అందరినీ తీసుకుంటుంది. తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అందరిని తీసుకోవాలని అన్నారు. తమిళ్ పరిశ్రమ తమిళ్ వారికే అంటే పరిశ్రమ ఎదగదు. ఈరోజున తెలుగు పరిశ్రమ ఎదుగుతున్నాం అంటే.. అన్ని పరిశ్రమలకు సంబంధించిన వారిని తీసుకుంటున్నాం. ఒక్కళ్ళు కాదు.. ఇది అన్ని భాషలు.. అన్ని కలయికలు ఉంటేనే సినిమా అవుతుంది తప్ప .. కేవలం మన భాష, మనమే ఉండాలి అంటే కుంచించుకుపోతామన్నారు. తమిళ్ పరిశ్రమ నుంచి బయటికి వచ్చి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తీయాలని, మీ పరిశ్రమను విస్తృతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక రోజా వచ్చిందంటే దానికి కారణం.. ఎఎం రత్నం గారు.. ఒక రోజా, జెంటిల్ మెన్ సినిమాలకు నిర్మాత ఆయనే.. ఆయన తెలుగు వ్యక్తి. కళాకారుడికి కులం, మతం, ప్రాంతం ఉంటే పరిశ్రమ ఎదగదని అన్నారు పవన్. ఏవైనా కార్మిక సమస్యలు ఉంటే పరిష్కరించుకొని అందరు ఒక్కటిగా ఉండాలన్నారు. ఆ పరిధులను దాటి ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.