ఏజెంట్ సినిమా ఫెయిల్యూర్ కు పూర్తి బాధ్యత మాదే : నిర్మాత ట్వీట్ వైరల్

ఏజెంట్ సినిమా ఫెయిల్ కావడానికి పూర్తి బాధ్యత తమదేనంటూ ఆయన ట్వీట్ చేశారు. సినిమా పరాజయానికి కారణం తామేనన్నారు.

Update: 2023-05-02 05:47 GMT

ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలి షో నుండి నెగిటివ్ టాక్ రావడంతో.. ఏజెంట్ కు ఊహించిన దానిలో సగం వసూళ్లు కూడా రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించారు. రూ.80 కోట్ల బడ్జెట్ తో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. కాగా.. ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశ పరచడంతో.. నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ ఫెయిల్యూర్ పై స్పందించారు.

ఏజెంట్ సినిమా ఫెయిల్ కావడానికి పూర్తి బాధ్యత తమదేనంటూ ఆయన ట్వీట్ చేశారు. సినిమా పరాజయానికి కారణం తామేనన్నారు. అదో పెద్ద టాస్క్ అని తెలిసినా సాధించగలమన్న నమ్మకంతో సినిమా చేస్తే, అది ఫెయిల్ అయిందన్నారు. సినిమా స్క్రిప్ట్ పూర్తిగా రెడీ కాకముందే షూటింగ్ మొదలుపెట్టి తప్పు చేశామని, అదే సమయంలో కోవిడ్ తో పాటు పలు సమస్యలు కూడా తలెత్తాయన్నారు. ఏజెంట్ ఫెయిల్యూర్ కి సాకులు చెప్పాలని అనుకోవడం లేదన్న ఆయన.. ఈ ఖరీదైన తప్పిదాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామని, ఈ లోటును తర్వాత ప్రాజెక్టులతో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రేక్షకులు తమపై ఎంతో నమ్మకం పెట్టకున్నారని, దానిని వమ్ము చేసినందుకు క్షమించాలని వేడుకున్నారు. అనిల్ సుంకర చేసిన ఈ ట్వీట్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా ఫెయిల్యూర్ ను ఒక నిర్మాతగా అంగీకరించడం సాధారణమైన విషయం కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News