ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపి... ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసిన '2.ఓ' ఎట్టకేలకి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమాపై ఉన్న క్రేజ్‌కి తగ్గట్టుగానే రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్‌గా అన్నిచోట్ల నుంచి హిట్ అనే టాక్ వచ్చేసింది. అయితే అంత మాత్రాన ఆ సినిమా విమర్శల నుంచి తప్పించుకుందనడానికి వీల్లేదు. విజువల్ గ్రాండియర్... శంకర్ రాసుకొన్న కాన్సెప్ట్ వరకు సూపర్బ్ అనిపించినా కథ చెప్పడంలో మాత్రం శంకర్‌కి పెద్దగా మార్కులు దక్కలేదు. ఈమధ్యే '2.ఓ' తరహాలోనే భారీ బడ్జెట్‌తో 'బాహుబలి' చిత్రాల్ని తీసి విజయాన్ని అందుకున్నాడు కాబట్టి అంతా రాజమౌళితో శంకర్ పనితీరును పోల్చడం మొదలుపెట్టారు. విడుదలకి ముందే రాజమౌళి బెస్టా, శంకర్ బెస్టా అనే లెక్కలు మొదలయ్యాయి.
కేవలం విజువల్ ఎఫెక్ట్స్...
నిన్న సినిమా చూసొచ్చాక కూడా ప్రేక్షకులు, విమర్శకులు బాహుబలితో పోల్చి చూసుకోవడం కనిపించింది. కథ చెప్పడంలో రాజమౌళినే ది బెస్ట్ అనే అభిప్రాయాలు వినిపించాయి. ఎమోషన్స్ విషయంలో, కాన్ఫ్లిక్ట్ విషయంలో... రాజమౌళి అత్యున్నత ప్రమాణాలు పాటించి బాహుబలి సినిమా తీశాడని, 2.ఓ విషయంలో మాత్రం శంకర్ కేవలం టెక్నిక్‌నే నమ్ముకొన్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతవరకు అది నిజం కూడా. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో అక్షయ్ కుమార్ పార్ట్ మాత్రం కాస్త ఎమోషనల్‌గా అనిపించినా.. మిగతా సన్నివేశాల్లో టెక్నికల్ హంగామానే కనిపించింది. అలాగే విజువల్స్ పరంగా కూడా ప్రథమార్థం వరకు సహజంగా అనిపించినా... ద్వితీయార్థంలో మాత్రం విజువల్ ఎపెక్ట్స్ టూమచ్‌గా ఉండటంతో అవి కార్టూన్ షోని తలపించిందనే అభిప్రాయాలు వినిపించాయి.