టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అంటే వెంటనే దిల్ రాజు..సురేష్ బాబు..అల్లు అరవింద్ అనేస్తాం. వీరు అందరు కలిసి చిన్న ప్రొడ్యూసర్స్ కి థియేటర్స్ ఇవ్వడంలేదని ఆ మధ్య గొడవలు కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం 2.0 రిలీజ్ విషయంలో మాత్రం దగ్గుబాటి సురేష్ బాబు..దిల్ రాజు మధ్య పోటీ జరుగుతుంది. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి '2.0' రిలీజ్ విషయంలో రచ్చ చేస్తున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు - ఏషియన్ ఫిలింస్ సునీల్ నారంగ్ ఒక గ్రూప్ కాగా...ఎన్.వి.ప్రసాద్- దిల్ రాజు-యువి క్రియేషన్స్ వంశీ ఒక గ్రూప్ గా విడిపోయి 2.0 హక్కుల విషయంలో పోటీ పడుతున్నారు. దాంతో నిర్మాత ఐన శుభాస్కరన్ కు రిలీజ్ కి ముందే తెలుగు వెర్షన్ రూపంలో 4 కోట్ల నష్టం వచ్చింది. అదేంటి సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండా నష్టం ఎలా వచ్చింది అనుకుంటున్నారా? దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది..
'2.0' తెలుగు వెర్షన్ కోసం డి.సురేష్ బాబు - సునీల్ నారంగ్ ఇద్దరు కలిసి 82 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అందులో కొంత అడ్వాన్స్ కూడా ఇచున్నారు. అయితే కొన్ని కారణాలు వల్ల '2.0' రిలీజ్ పదే పదే వాయిదా పడిన సంగతి తెలిసిందే. కారణం ఏదైనా అడ్వాన్సుల విషయంలో పెద్ద పేచీ లైకా సంస్థకు సురేష్-నారంగ్ బృందానికి మధ్య నడిచింది. ఆ తరువాత ఈచిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ - దిల్ రాజు- యువి క్రియేషన్స్ వంశీ టేకోవర్ చేశారు. కొన్ని కండిషన్స్ తో నిర్మాత శుభాస్కరన్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈనేపధ్యంలో అడ్వాన్సులపై వడ్డీ ఇవ్వాల్సిందేనంటూ లైకా సంస్థ తో డి.సురేష్ బాబు - సునీల్ నారంగ్ వాదనకు దిగారట. దాంతో వీరిని కాదని తెలుగులో సినిమాను రిలీజ్ చేయడం కష్టం అని తెలుసుకుని నిర్మాత శుభాస్కరన్ 4 కోట్లు వడ్డీ ఇచ్చినట్టు సమాచారం. దాంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. అలా '2.0' ప్రొడ్యూసర్ కి రిలీజ్ కి ముందే 4 కోట్ల నష్టం వచ్చింది. తమిళ్ - హిందీ - తెలుగు సహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ రేంజులో '2.0' ఈనెల 29న రిలీజ్ అవుతుంది.