అల్లు అర్జున్‌తో తీయాలనుకున్న సినిమాని... నానితో తీయడానికి సన్నద్ధమవుతున్నాడు విక్రమ్ కె.కుమార్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందనున్న ఆ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. అయితే అల్లు అర్జున్‌తో ఆ సినిమా తీయకపోవడానికి కారణాలేంటన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. ఆయన బదులు నానిని ఎంపిక చేసుకోవడానికి గల కారణాల గురించి మాత్రం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. విక్రమ్ ఓ థ్రిల్లర్ కథాంశంతో... విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్దపీట వేస్తూ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. కథ రీత్యా భారీ బడ్జెట్ అవసరం కాబోతోందట. అల్లు అర్జున్ కథానాయకుడైతే తెలుగు, తమిళం భాషల్లో తీసి, ఎలాగో ఆయనకి మలయాళంలోనూ మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ కూడా విడుదల చేసుకోవచ్చని... ఆ రకంగా పెట్టిన బడ్జెట్‌ని తిరిగి రాబట్టుకోవచ్చని ప్లాన్ వేశారట. అయితే అల్లు అర్జున్ ఆ సినిమా చేయకపోవడంతో విక్రమ్ మరో కథానాయకుడిని వెతకాల్సి వచ్చింది. పలువురు కథానాయకుల్ని పరిశీలించాక నాని అయితేనే కరెక్ట్ అని ఆయనతో సినిమా చేయడానికి సన్నద్ధమయ్యారు. నానికి తెలుగుతో పాటు, తమిళంలోనూ మంచి మార్కెట్ ఉంది. ఈగ సినిమా వల్ల హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. దాంతో తాను తీయాలనుకున్న సినిమా స్థాయికి నాని, ఆయన మార్కెట్ అయితేనే బాగుంటుందని ఆయన వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.
విచిత్రమైన అవతారం
ఈ సినిమాలో నాని ఓ విచిత్రమైన అవతారంలో కనిపించనున్నట్టు తెలిసింది. 24లో సూర్య ఎలాగైతే రకరకాల షేడ్స్ లో కనిపించాడో అలా నానిని కూడా చూపించబోతున్నాడట విక్రమ్. ఇందులో రకరకాల మెషిన్లు కనిపించబోతున్నాయట. అసలు ఈ కథ ఏ నేపథ్యంలో సాగుతుందన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాని 'జెర్సీ'లో నటిస్తున్నాడు. అది పూర్తయ్యాక విక్రమ్ సినిమా కోసం రంగంలోకి దిగుతాడు.