అభిమానులకు షాక్.. ఇకపై అక్కడ ఫ్యాన్ షోస్, బెనిఫిట్ షోస్ ఉండవు.. కారణమిదే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల కొన్ని థియేటర్లలో పోకిరి స్పెషల్ షోలు వేశారు. పాత సినిమా కదా అని..;

Update: 2022-08-16 10:35 GMT

అభిమాన హీరో సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. తమ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. ఫ్యాన్స్ షో లు, బెనిఫిట్ షోలంటూ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. వాటికి పాలాభిషేకాలు చేస్తారు. థియేటర్ల ముందు బాణసంచా పేల్చి.. తీన్ మార్ డప్పులకు స్టెప్పులేస్తారు. థియేటర్ లోపలికెళ్తే.. రచ్చ రచ్చే అన్నట్లుగా ఉంటుంది అభిమానుల హంగామా. కానీ.. మితిమీరిన అభిమానంతో థియేటర్లోని ఫర్నిచర్ ధ్వంసమైతే ఎలా? సీట్స్ విరగ్గొట్టడం, స్క్రీన్ చింపడం, థియేటర్లోని సామాగ్రిని బ్రేక్ చేయడం లాంటివి చేయడం వల్ల యాజమాన్యాలు నష్టపోతుంటాయి.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల కొన్ని థియేటర్లలో పోకిరి స్పెషల్ షోలు వేశారు. పాత సినిమా కదా అని లైట్ తీసుకోలేదు. ఊహించని రీతిలో థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. అంతవరకూ బాగానే ఉంది. కానీ అత్యుత్సాహంతో కొందరు అభిమానులు థియేటర్లో సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటన కాకినాడలోని ఓ థియేటర్లో జరిగింది. ఫ్యాన్స్ చేసిందానికి ఆ థియేటర్ యాజమాన్యానికి భారీగా నష్టం జరిగిందట. అందుకే కాకినాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ఇకపై కాకినాడలో, కాకినాడ పరిసర ప్రాంతాల్లో, కాకినాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ లో ఉన్న అన్ని థియేటర్స్ లో ఫ్యాన్స్ షోలు, బెనిఫిట్ షోలు బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాకినాడలో ఉన్న ఏ థియేటర్ వారైనా ఈ నిర్ణయాన్ని దాటి షోలు వేస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది. త్వరలో ఘరానా మొగుడు, జల్సా సినిమాలు కూడా రీ రిలీజ్ ఉన్న సమయంలో కాకినాడ ఎగ్జిబిటర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Tags:    

Similar News