తెలుగులో బిగ్ బాస్ సీజన్ 2 రీసెంట్ గా కంప్లీట్ అయ్యి సీజన్ 3 కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ హిందీలో మాత్రం ప్రస్తుతం సీజన్ 12 నడుస్తుంది. అక్కడ బిగ్ బాస్ కి క్రేజ్ ఎక్కువ. హిందీలో 12వ సీజన్ రోజురోజుకూ నాటకీయ ఘటనలతో ఆసక్తికరంగా మారుతోంది. రీసెంట్ గా క్రికెటర్ శ్రీశాంత్ - సురభి రానా మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇద్దరు గొడవ పడిన తరువాత శ్రీశాంత్ బాత్ రూమ్ కి వెళ్లి తన తలను గోడకేసి కొట్టుకోవడంతో గాయాలు కాగా, అతన్ని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
వ్యక్తిగత విమర్శలకు దిగి...
ఈ గొడవకి ముందు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదమే జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకున్నారు. హద్దులు దాటి మరీ వ్యక్తిగత దూషణలకు దిగారు. మొదట సురభి... శ్రీశాంత్ ను మ్యాచ్ ఫిక్సర్ అని, చీటర్ అని దుమ్మెత్తి పోసింది. ఆ తరువాత శ్రీశాంత్ సైతం ఆగ్రహంతో సురభిని ఓ వ్యభిచారి అంటూ సంబోధించాడు. దాంతో వెంటనే శ్రీశాంత్ తన తొందరపాటుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, ఆమెకు క్షమాపణలు చెప్పాడు.
గోడకు తల బాదుకుని...
అయినా కానీ తనలో తానూ కుమిలిపోతూ, బాత్ రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుని, తలను గోడకేసి బాదుకున్నాడు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. శ్రీశాంత్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ ను ఏర్పరుచుకున్నారు. నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉంటున్న శ్రీశాంత్ కు మరింత ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. సీజన్ 12 టైటిల్ విన్నర్ రేస్ లో శ్రీశాంత్ కూడా ఉన్నాడు.